SERP: సెర్ప్‌లో అదనపు రింగ్ లీడర్
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:41 AM
సెర్ప్‌లో ఆయనో రింగ్ లీడర్. ఆయనేది చెప్తే అదే శిలాశాసనం. నిబంధనలు బేఖాతరు చేయడంలో ఆయన దిట్ట.
లేని అదనపు సీఈవో పోస్టులో చేరి హల్‌చల్
బదిలీల్లో ఇష్టారాజ్యం..అస్మదీయులకు అడ్డగోలుగా పోస్టులు
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై చిన్నచూపు..అవినీతి అధికారులకు అందలం
మంత్రులూ.. ఎమ్మెల్యేల సిఫారసులూ బేఖాతర్
డిప్యుటేషన్ అధికారి తీరుతో భ్రష్టుపడుతున్న సెర్ప్
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): సెర్ప్‌లో ఆయనో రింగ్ లీడర్. ఆయనేది చెప్తే అదే శిలాశాసనం. నిబంధనలు బేఖాతరు చేయడంలో ఆయన దిట్ట. సహకార శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన లేని సెర్ప్ అడిషనల్ సీఈవో పోస్టులో తిష్ట వేశారు. ఇటీవలి సాధారణ బదిలీల ప్రక్రియలో ఆయన జోక్యం శృతిమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు సిబ్బంది బదిలీలు గందరగోళంగా మారాయి. సెర్ప్ సీఈవో తనకున్న పాత పరిచయంతో కొంత మంది అధికారులను సెర్ప్ కార్యాలయంలోకి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండే ఆయన సెర్ప్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో అదనపు సెర్ప్ సీఈవో పోస్టు లేనే లేదు. అయితే ప్రస్తుత సెర్ప్ సీఈవో... ఎక్స్ అఫిషియో సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నందున తనకున్న అధికారాలతో లేని అదనపు సెర్ప్ సీఈవో పోస్టులో ఉత్తరాంధ్రకు చెందిన ఈ సహకార శాఖ అధికారిని నియమించుకున్నారు. దీంతో సెర్ప్ కార్యాలయం గందరగోళంగా మారిపోయింది. సామర్థ్యం లేని కొందరిని ఏకంగా డైరెక్టర్లుగా నియమించడంతో సెర్ప్ సీఈవో విమర్శలు మూటగట్టుకున్నారు. గతంలో సెర్ప్ పెన్షన్ విభాగానికి సంబంధించి డైరెక్టర్ ఉండేవారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ బదిలీ కావడంతో ఆ స్థానంలో ఏపీవో బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఏపీవోను ఏలూరుకు బదిలీ చేశారు. బదిలీ అయిన ఆ ఏపీవోను తిరిగి పిలిచి ఏకంగా పెన్షన్ విభాగానికి డైరెక్టర్ బాద్యతలు అప్పజెప్పారు. అంతే కాకుండా ఎంఐఎస్ విభాగానికి ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకూ సిద్ధం అయ్యారు. ఒక కులం వారికి పెద్ద పీట వేసి ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపిస్తున్నారన్న ఆరోపణలూ ఈ అధికారిపై ఉన్నాయి. ఇటీవల ఈ అధికారి తీరుకు నిరసనగా సెర్ప్‌లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
మంత్రులూ, ఎమ్మెల్యేల సిఫారసులూ డోంట్ కేర్
సెర్ప్ కార్యాలయంలో బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులిచ్చిన లేఖలను కూడా పట్టించుకోని ఈ అదనపు సీఈవో... సాక్షాత్తు సెర్ప్ మంత్రి చేసిన సిఫారసులను కూడా పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. పోనీ బదిలీలు పారదర్శకంగా జరిగాయా అంటే అదీ లేదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో బదిలీలకు ప్రత్యేక పరిశీలకుడిగా వెళ్లిన ఈ అదనపు సీఈవో ఇష్టారీతిన బదిలీలు చేపట్టారు. ఈ అధికారిని అతిగా విశ్వసిస్తున్న సీఈవో... ఆయనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారినే మందలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ డీపీఎంను శ్రీకాకుళం నుంచి ఏఎస్ఆర్ జిల్లాకు బదిలీ చేశారు. అయితే సెర్ప్ అదనపు సీఈవో ఆయన్ను అర్జెంట్‌గా విజయవాడ సెర్ప్ కార్యాలయానికి తీసుకురావాలని హుకుం జారీ చేయడం గమనార్హం. మరోవైపు, అదనపు సీఈవో రాకతో సెర్ప్‌ను అవినీతి ఆరోపణలున్న ఎదుర్కొంటున్న వారితో నింపేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేట్ ఆడిట్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ఓ అధికారిని ఇక్కడ డైరెక్టర్‌గా నియమించాలని అదనపు సీఈవో భావించారు. ఆయన అనుకున్నదే తడువుగా సెర్ప్ సీఈవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారికి రిటైర్ అయిన తర్వాత పోస్టింగ్ ఇవ్వాలంటే సీఎం ఆమోదం ఉండాలి. అదేమీ పట్టించుకోలేదు. ఆ అధికారిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆయన రిటైర్ కావడానికి ఆరు రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చింది. ఆరు రోజుల్లోనే ఆ అధికారి స్టేట్ ఆడిట్ విభాగంలో విచ్చలవిడిగా బదిలీ చేపట్టారు. ఫైల్స్ కూడా కనపడకుండా చేసి నిబంధనలను అడ్డగోలుగా తుంగలో తొక్కారన్న ఆరోపణలున్నాయి. అలాంటి అధికారిని సెర్ప్‌లో ప్రధానమైన పోస్టులోకి తీసుకురావడం ఎందుకో మరి.
కార్యాలయం మార్పుతో నెలకు రూ.6 లక్షల భారం
విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీ కార్యాలయంలో ప్రస్తుతం సెర్ప్ కార్యాలయం సకల సౌకర్యాలతో ఉంది. పైగా రాష్ట్రం నలుమూలల నుంచి సిబ్బంది గాని, డ్వాక్రా సంఘాలు గాని వచ్చి తమ పనులు చేసుకునేందుకు అందుబాటులో ఉంది. ఆర్టీసీకి చెందిన ఈ కార్యాలయానికి చదరపు అడుగుకు రూ.30లు అద్దెగా చెల్లిస్తున్నారు. అయితే అదనపు సీఈవోకు, సెర్ప్ సీఈవోకు ఈ కార్యాలయం నచ్చలేదట. అంతే అర్జెంట్‌గా మారిపోవాలని నిర్ణయించేసుకున్నారు. విజయవాడలోని మహానాడు రోడ్డు చివరన ఆటోనగర్‌కు దగ్గరగా చదరపు అడుగు రూ.45లతో కొత్త భవనంలోకి మారడానికి రంగం సిద్ధం చేశారు. ఆ మేరకు భవన యజమానికి ఇప్పటికే రూ.27 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతమున్న సెర్ప్ కార్యాలయం సరిపోకపోతే అదే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అదనపు భవనాలున్నాయి. అక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మార్చాలన్న నిర్ణయంతో సెర్ప్‌పై అదనంగా ప్రతి నెలా రూ.6 లక్షల భారం పడుతుంది. పేదరిక నిర్మూలనలో ప్రధానపాత్ర పోషించాల్సిన సెర్ప్ కార్యాలయంలో అంతా గందరగోళంగా మారడంతో ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా ఎలా సాగుతాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెర్ప్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jul 03 , 2025 | 05:41 AM