Amaravati: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా
ABN, Publish Date - Jun 28 , 2025 | 02:50 AM
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. పేదల సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందికి సాంత్వన
ఏడాదిలో 35 వేల మందికి 394 కోట్ల సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం
3,354 మందికి రూ.89 కోట్ల మేర ఎల్‌వోసీల ద్వారా వైద్యం
వైద్యం కోసం అప్పులు చేసి ఆర్థికంగా నలిగిపోకూడదన్న
ఆలోచనలో సీఎం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. పేదల సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పింఛన్ల రూపంలో ఏడాదికి ఏకంగా రూ.34 వేల కోట్లు వ్యయం చేస్తుండగా.. ఇదే సమయంలో అనారోగ్యం బారిన పడి, ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి అందుతున్న సాయంతో వేలాది మందికి సాంత్వన చేకూరుతోంది.
గతంలో మరే ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సీఎం చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ కోసం భారీగా నిధుల కేటాయించి బాధిత ప్రజలను ఆదుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎంఆర్‌ఎఫ్ ద్వారా దాదాపు 35 వేల మందికి రూ.394 కోట్ల మేర సాయం అందించారు. అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వైద్యం ఆలస్యం కాకుండా సాయం చేస్తున్నారు. ఆయా కుటుంబాల పరిస్థితి, ఆనారోగ్య తీవ్రత ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నారు. ఏడాదిలో 3,354 మందికి రూ.89 కోట్ల మేర ఎల్‌వోసీల ఇచ్చి వైద్యం అందేలా చేశారు. సీఎం సహాయ నిధి విషయంలో ఎక్కడా జాప్యం కాకుండా సీఎం కార్యాలయం, ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి సమన్వయం చేసుకుంటున్నారు.
సీఎంకు వచ్చే అర్జీల్లో ఇవే ఎక్కువ!
సీఎంను కలిసే వారిలో, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల్లో చాలా వరకు సీఎంఆర్‌ఎఫ్ సాయం కోరే అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విభాగాన్ని అత్యంత కీలకంగా భావించిన సీఎం.. ఆర్జీలు, వినతులను గంటలు, రోజుల వ్యవధిలో పరిష్కరించే యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచారు. తీవ్ర ఆనారోగ్య సమస్యలకు అప్పోసొప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు.. ప్రభుత్వం ఆ ఖర్చును సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చెల్లించి ఆదుకుంటోంది. ఊహించని ఉత్పాతంలా కుటుంబాన్ని రోడ్డున పడేసే జబ్బులతో పేదలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యే ద్వారానో, నేరుగానో సీఎం సహాయ నిధి కోసం చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు. చిన్న కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలు అవ్వకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.
గతంలో ఎవరూ చేయని స్థాయిలో..
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 మధ్య సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.758 కోట్లు మాత్రమే పేదలకు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే సహాయ నిధికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సాయం కోసం సీఎం కార్యాలయం తలుపు తడితే చాలు.. వెంటనే స్పందించి మేమున్నామనే భరోసా కల్పించే లా వ్యవస్థను తీర్చిదిద్దారు. సీఎం సహాయ నిధి ద్వారా 2014 నుంచి ఐదేళ్ల కాలంలో రూ.1,533 కోట్లు అందించారు. 13 జిల్లాల్లో 2,23,742 మందికి లబ్ధి కలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో ముగ్గురు సీఎంలు కలిపి చేసిన సాయం కంటే చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రెట్టింపు సాయం అందించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాయాన్ని అరకొరగానే అందించారు. కనీసం ఆర్జీలు కూడా సక్రమంగా స్వీకరించే వారు కాదు. 2019-2024 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం రూ.897 కోట్లు మాత్రమే సాయం అందించింది.
Updated Date - Jun 28 , 2025 | 02:50 AM