CM Chandrababu: ప్రధాని మోదీ సూచనలు పరిగణలోకి తీసుకోండి: సీఎం ఆదేశం
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:32 PM
రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేసిన సూచనలు సైతం పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి, జూన్ 05: రీసైక్లింగ్‌పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూన్ 05వ తేదీ.. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలను నాటారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేసిన సూచనలు సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్బంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మియావాకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావాకీ విధానాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల సమన్వయంతో ప్రతీ 15 రోజులకోసారి రీసైక్లింగ్ విధానంపై తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సైక్లింగ్‌పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి.. మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మరోవైపు రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆ ప్రాంతలో 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. భవిష్యత్తులో కనీసం 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే.. సింగపూర్, జపాన్‌తో సంప్రదించి అక్కడ ప్లాంటేషన్ ఎలా ఉందో.. అదే తరహాలో ఇక్కడ సైతం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jun 05 , 2025 | 12:37 PM