Tomato: టమోటా రైతుకు ఊరట
ABN, Publish Date - Jun 10 , 2025 | 02:30 AM
పలమనేరు మార్కెట్‌లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.
పలమనేరు/సోమల, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : పలమనేరు మార్కెట్‌లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్లపక్కన పారపోసి వెళ్లిపోతున్నారు. టమోటా బాక్సు కేవలం రూ. 40నుంచి 80కే పరిమితమవుతూ వచ్చింది. అనూహ్యంగా ఈనెల 7న ఇక్కడి మార్కెట్‌లో బాక్సు ధర రూ. 170కి పెరిగింది. మర్నాడు అంటే ఆదివారం బాక్సు ధర రూ. 220కి చేరుకొంది. సోమవారం రూ. 350 పలికింది. ఇన్నాళ్లూ నిరాశ చెందిన రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ధరలు కొనసాగితే పెట్టుబడి ఖర్చులకు ఢోకా ఉండదని రైతులంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో విపరీతంగా కురిసిన వర్షాలకు టమోటా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక్కడ ధరలు క్రమేపీ పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పుంగనూరు, కోలారు, కలికిరి, కలకడ మార్కెట్లలో 15కిలోల టమోటా బాక్సు రూ. 250 నుంచి రూ. 300 వరకు చేరుకుంది. రెండో రకం రూ. 150 నుంచి రూ. 200కు చేరుకుంది. దీంతో తోటల్లో వదిలేసిన కాయలను కూడా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. నాణ్యత లేని కాయల బాక్సు సైతం రూ.100 పలుకుతోంది. మార్చిలో నాటిన టమోటా తోటల్లో కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నాటిన టమోటా తోటల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి.
Updated Date - Jun 10 , 2025 | 02:30 AM