Tirupati: తిరుపతిలో దారుణం.. అప్పు తీసుకున్న పాపానికి..
ABN, Publish Date - May 25 , 2025 | 09:17 AM
అప్పు తీసుకున్న పాపానికి ఆ కుటుంబాన్ని కట్టు బానిసలుగా మార్చారు. ఈ బాధలు భరించలేమంటూ ఆ కుటుంబం చెప్పడంతో అధిక వడ్డీతో రుణం తీర్చి వెళ్లాలంటూ డిమాండ్ చేశాడు. అందుకు కన్న కొడుకుని పూచీకత్తుగా పెట్టినందుకు అతడు విగత జీవిగా మారాడు.
చిత్తూరు, మే 25: అప్పు తీసుకోవడమే ఆ కుటుంబం చేసిన నేరం. కేవలం రూ. 25 వేలు అప్పు తీసుకున్న పాపానికి ఆ కుటుంబమంతా రుణం తీసుకున్న వ్యక్తి వద్ద వెట్టి చాకిరీ చేసింది. ఆ క్రమంలో అప్పు తీసుకున్న ఇంటి యజమానే కాదు.. అతడి కుమారుడు సైతం మరణించాడు. ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. గిరిజన తెగకు చెందిన చెంచయ్య.. బాతుల పెంపకం దారుడి వద్ద రూ. 25 వేలు అప్పు తీసుకున్నారు. దీంతో సదరు పెంపకందారుడి వద్ద చెంచయ్యతోపాటు అతడి భార్య అంకమ్మ, వారి ముగ్గురు పిల్లలు చాలా కాలంగా వెట్టి చాకిరి చేస్తున్నారు. ఇంతలో చెంచయ్య తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో అతడి కుటుంబం వెట్టి చాకిరిలోనే కొనసాగింది.
అయితే సమయం, సందర్భంగా లేకుండా వెట్టి చాకిరి చేయడంతో అంకమ్మ కుటుంబం విసిగిపోయింది. రుణం చెల్లించి వెళ్లిపోతామంటూ బాతుల పెంపకందారుడి వద్ద అంకమ్మ తన పిల్లలతో మెుర పెట్టుకుంది. అయితే ఒక కుమారుడిని తన వద్ద పూచీకత్తుగా ఉంచి వెళ్లాలని ఆమెకు సూచించాడు. దీంతో చేసేదేమీ లేక అంకమ్మ.. తన కుమారుల్లో ఒకరిని అతడి వద్ద విడిచి వెళ్లింది. మధ్య మధ్యలో తన కుమారుడికి ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేది. ఈ క్రమంలో తనను తీసుకెళ్లాలంటూ బాలుడు తన తల్లిని వేడుకునేవాడు.
సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్తానంటూ చిన్నారికి ఆ తల్లి భరోసా ఇచ్చేది. అయితే కొన్ని రోజుల క్రితం ఎప్పటిలాగానే కుమారుడికి అంకమ్మ ఫోన్ చేసింది. అయితే బాతుల పెంపకందారుడు స్పందిస్తూ.. నీ కుమారుడు మా ఇంటి నుంచి పారిపోయాడంటూ ఆమెకు చెప్పాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదే మాట చెప్పుకొచ్చాడు. దీంతో సందేహించిన సదరు మహిళ.. గిరిజన తెగకు చెందిన పెద్దలను కలిసి విషయాన్ని వివరించింది. వారంతా బాతుల పెంపకందారుడి నివాసానికి వెళ్లి వివరణ కోరారు.
అయితే, అంకమ్మ కుమారుడు అనారోగ్యం కారణంగా మరణించాడని తెలిపాడు బాతుల పెంపకందారుడు. అంతేకాదు.. బాలుడి మృతదేహాన్ని తమిళనాడు కాంచీపురంలోని తన అత్తమామల ఇంటి వద్ద పూడ్చిపెట్టానంటూ వివరించాడు. దీంతో అంకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్తపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె కుమారుడి మరణవార్త విని తల్లడిల్లింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ క్రమంలో కాంచీపురంలో కుమారుడి మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టడంతో.. అక్కడే ఉన్న అంకమ్మ బిగ్గరగా రోదించింది. ఈ సంఘటన స్థానికులకు తీవ్రంగా కలిచివేసింది.
అంతేకాకుండా.. బాతుల పెంపకందారుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ వ్యవహారంలో బాతుల పెంపకందారుడిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల ఈ గిరిజన తెగకు చెందిన దాదాపు 50మందిని వెట్టి చాకిరి నుంచి రక్షించామని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన..
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
For National News And Telugu News
Updated Date - May 25 , 2025 | 11:06 AM