Share News

Rains: భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన..

ABN , Publish Date - May 25 , 2025 | 07:50 AM

దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం విమాన సర్వీసులపై పడింది.

Rains: భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన..
Rains in NewDelhi

న్యూఢిల్లీ, మే 25: ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీ చిగురుటాకులా వణుకుతోంది. ఉరుములతోపాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో మహానగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. దాదాపు 100 విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడిందని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.

మరో 25 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు చెప్పింది. దీంతో తమ విమాన ప్రయాణాలకు సంబంధించిన లాస్ట్ అప్ డేట్ చూసుకొని బయలుదేరాలని ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు సూచించారు. మరోవైపు న్యూఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష పాతాన్ని వాతావరణ శాఖ వివరించింది.


సఫ్దర్‌జంగ్‌తోపాటు పలు ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైందని పేర్కొంది. మరోవైపు నగర పాలక సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని కాలువల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ఢిల్లీతోపాటు దేశ రాజధానికి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.


కేరళ, మహారాష్ట్రల్లో రెడ్ అలర్ట్..

ఇక నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో కేరళతోపాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తమిళనాడు, కర్ణాటకల్లో..

తమిళనాడులో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. అలాగే కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. నదీ పరివాహక ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతానికి తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద కూడా లేని తెలుగు చిత్ర పరిశ్రమ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

For National News And Telugu News

Updated Date - May 25 , 2025 | 08:44 AM