Tirumala: అన్యమత గుర్తులతో తిరుమలకు చేరిన కార్లు
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:26 AM
అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
తిరుమల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు శుక్రవారం అన్యమత గుర్తులతో రెండు కార్లు వచ్చాయి. అన్యమత గుర్తులు, జెండా లు, స్టిక్కర్లు, ప్రతిమలతో వాహనాలు రావడం నిషేధం. వీటిని అలిపిరి చెక్‌పాయింట్‌లోని భద్రతాసిబ్బంది తనిఖీల్లో గుర్తించి అడ్డుకోవాలి. ఇటీవల సిబ్బంది నిర్లక్ష్యపు తనిఖీలతో అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
తిరుమల ఘాట్‌లో రూ.10.75 కోట్లతో రోడ్డు పనులు
తిరుమల ఘాట్‌లో రూ.10.75 కోట్లతో ఇటీవల టీటీడీ మొదలు పెట్టిన తారు రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ఇటీవల మొదటి, రెండవ ఘాట్‌రోడ్లు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. 2021 నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, డ్రైనేజ్ పనులు, ఘాట్‌రోడ్ల వెంబడి క్రాష్‌బ్యారియర్ వంటి పనులతో రెండు ఘాట్‌రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు రెండు ఘాట్‌రోడ్లలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా బిట్యూమినస్ కాంక్రీట్, బిట్యూమినస్ మెకాడమ్, హాట్ అప్టైడ్ థర్మోప్లాస్టిక్ కంపౌండ్ వంటి పనులతో పాటు రైజ్డ్ పేవ్‌మెంట్ మార్కర్లు(రోడ్ స్టడ్స్), సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని బోర్డులో తీర్మానించారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో వారం ఇందట తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండో ఘాట్‌రోడ్డులో పనులను ప్రారంభించారు. అలిపిరి నుంచి ప్రారంభించిన నూతన తారు రోడ్డు నిర్మాణం ప్రస్తుతం వినాయకస్వామి ఆలయం వరకు చేరుకుంది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఓ వైపు రోడ్డును వేసి పూర్తిగా ఆరిన తర్వాత మరోవైపు తారురోడ్డు వేసేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇలా ఆరు నెలల్లో రెండో ఘాట్‌రోడ్డుతో పాటు తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటిఘాట్‌లో తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచే సేలా ప్రణాళికలు రూపొందించారు.
Updated Date - Jun 21 , 2025 | 01:26 AM