Occupation: ఆక్రమణలో 1343 ఎకరాలు
ABN, Publish Date - Jul 12 , 2025 | 01:01 AM
దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు. వాటి పరిరక్షణకు రెవిన్యూ, ఇతర అనుబంధ శాఖలతో దేవదాయ శాఖ అధికారులు, సమన్వయం చేసుకుని కృషిచేయాలని ఆయన ఆదేశించారు.చిత్తూరులోని డీఆర్వో చాంబర్‌లో దేవాదాయ భూముల పరిరక్షణపై జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో డీఆర్వో అధ్యక్షతన శుక్రవారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 17,540 ఎకరాల దేవదాయ శాఖ భూములుండగా, వాటిలో 1343.17 ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వీటిపై కోర్టుల్లో కేసులున్నచోట వాటి స్టే వెకేషన్ కోసం కౌంటర్ పిటీషన్లు దాఖలు చేయాలని దేవాదాయశాఖ అధికారులను డీఆర్వో ఆదేశించారు. 9761 ఎకరాలకు గాను గత సెప్టెంబరు నెలలో నిర్వహించిన సమావేశం నాటికి 4866 ఎకరాల భూములు 1బీ అడంగళ్‌లో దేవాలయాలు, వాటి భూవిస్తీర్ణ వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు. జూన్ ఆఖరు నాటికి మరో 5500 ఎకరాలకు సంబంధించి 1బీలో భూ వివరాల నమోదు జరిగిందని చెప్పారు. మరో 2200 ఎకరాలకు పైబడిన భూవివరాలను 1బీ అడంగళ్‌లో దేవాలయాల పేర్లతో పాటు భూవివరాల నమోదుకు చర్యలు చేపట్టాలని రెవిన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. కొన్నిచోట్ల దేవదాయశాఖ అధికారులు లోపాయకారీగా భూములను తక్కువ ధరకే వేలం పాటలో లీజుకు ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సరైన ధరకు వేలం నిర్వహించి, భూములను లీజుకు ఇవ్వాలని దేవాదాయశాఖ ఈవోలను ఆదేశించారు. వివాదాస్పద భూములన్నింటినీ సర్వే చేయాలని సూచించారు. పెండింగ్‌లో వున్న జాయింట్ సర్వేను 30 రోజుల్లోగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పూర్తిచేయాలని ఆదేశించారు. 1బీ అడంగళ్‌లో పేర్ల మార్పులు, చేర్పులను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆలయాల ఆదాయం పెంచాలని, దేవాలయ భూములను గుర్తించిన తర్వాత వాటిని లీజులకు ఇవ్వడం ద్వారా దేవాలయాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని డీఆర్వో సూచించారు.ఎండోమెంట్ కమిషనర్ చిట్టెమ్మ, డీపీవో సుధాకర రావు, చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ హేమంతరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవదాయ భూ ఆస్తుల పరిరక్షణకు కమిటీ
దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి జిల్లా దేవదాయ శాఖ అధికారి లేదా అసిస్టెంట్ కమిషనర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్పీ, జేసీ, డీఆర్వో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, డీపీవో, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, సర్వే శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఉంటారు.
Updated Date - Jul 12 , 2025 | 01:01 AM