CM Chandrababu Naidu: రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వండి
ABN, Publish Date - Jul 17 , 2025 | 03:18 AM
రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థికసాయం అందించే పథకమైన సాస్కి
నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వినతి
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థికసాయం అందించే పథకమైన ‘సాస్కి’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానంతరం నిర్మలా సీతారామన్‌ను నార్త్‌బ్లాక్‌లోని ఆమె కార్యాలయంలో చంద్రబాబు కలుసుకున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలంటూ 16వ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని ఆమె దృష్టికి తీసుకెళ్లి, అందుకు అంగీకరించాలని విన్నవించారు. అమరావతి నిర్మాణానికి మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. రూ.26 వేల కోట్ల నిధులు దీనికోసం సమీకరించనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఇంకా నిధుల అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jul 17 , 2025 | 03:18 AM