CM Chandrababu Naidu: దావోస్‌కు ముందే భారీగా పెట్టుబడులు
ABN, Publish Date - Jan 26 , 2025 | 03:15 AM
దావోస్ సదస్సుకు ముందే రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రాక
దావోస్‌లోనే ఎంఓయూలు చేయాలనేది మిథ్య
అందరినీ ఒకేచోట కలపడమే సదస్సు స్పెషల్
ప్రపంచం తీరు తెలుసుకొనేందుకే అక్కడికి..
దానిని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం
ఏపీ విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు
సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు
మళ్లీ ఈ రాష్ట్రానికి రమ్మంటే వాళ్లు వస్తారా?
కోల్పోయిన ఏపీ ఇమేజిని పునరుద్ధరిస్తున్నాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
‘‘ముందు మనం మన కాళ్ల మీద నిలబడటం ముఖ్యం. అన్నింటికీ కేంద్రం మీదే ఆధారపడలేం. దేశంలోని అన్ని రాష్ర్టాలూ కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉంటాయి. మనది మరీ గడ్డు సమస్య. ముందు ఆక్సిజన్ కావాలి. అందుకే దావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను. కేంద్ర ప్రాయోజిత పఽథకాలన్నీ గత ఐదేళ్లూ నిలిచిపోయాయి. వాటన్నింటినీ మళ్లీ పునరుద్ధరించాం’’
- సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దావోస్‌లోనే పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు జరగాలని అనుకోవడం ఒక మిథ్య అని, దావోస్ సదస్సుకు ముందే రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీని బీపీసీఎల్ రూ. 95 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో పెట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక పరిశీలన, భూ సేకరణ కోసం ఆ కంపెనీ రూ.ఆరు వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఆర్సెలార్- నిప్పన్ కంపెనీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.లక్షా ముప్ఫై ఐదు వేల కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నంలో ఉంది. ముడి ఖనిజం కేటాయింపుపై ఆ కంపెనీకి... కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే ఆ స్టీల్ ప్లాంట్ వస్తుంది.
విశాఖ వద్ద పూడిమడకలో రూ.లక్షా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ప్రధాన మంత్రి శంకుస్ధాపన చేశారు.ఎల్జీ కంపెనీ రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెడుతోంది. గ్రీన్ కో కంపెనీ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మలేసియాకు చెందిన పెట్రోనాస్ కంపెనీతో కలిసి రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలో ఐదు వందల కంప్రెస్డ్ బయో గ్యాస్ తయారీ యూనిట్లు పెట్టాలని నిర్ణయించింది. గూగుల్ క్లౌడ్ తన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకొంటోంది. పన్నులకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆ కంపెనీ కేంద్రంతో చర్చిస్తోంది. అవి పరిష్కారం అయితే విశాఖకు గూగుల్ వస్తుంది. అది వస్తే విశాఖ దశ తిరుగుతుంది. అక్కడే టీసీఎస్ పది వేల మంది ఉద్యోగులతో డెవల్‌పమెంట్ సెంటర్ పెట్టబోతోంది. టాటా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియాను రాష్ట్రంలో ఒక విమానాశ్రయం నిర్మించాలని అడుగుతున్నాం. ఒక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగంలోనే రాష్ట్రానికి రూ. పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే ఇన్ని ఎంవోయూలు జరిగిన తర్వాత దావోస్‌లో అవి జరగలేదనుకోవడం సరికాదు. అక్కడ జరిగే ఎంవోయూల్లో ఎన్ని నిజంగా వచ్చాయో ఎవరూ చూడరు. ఇక్కడ ఉండేవారితో అక్కడ ఎంవోయూలు చేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. దావోస్‌లో రాష్ట్రాల మధ్య పోటీ నెలకొనడం ఆరోగ్యకరమైన సంప్రదాయం. వామపక్షాలు పాలిస్తున్న కేరళ ప్రభుత్వ బృందం కూడా దావోస్ వచ్చి పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది. పోటీ లేకపోతే ముందుకు వెళ్లలేం. అయితే అది పరస్పర సహకార పోటీ’’ అని చంద్రబాబు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నాలుగేళ్లలో చైనాను దాటేస్తాం..
‘‘దావోస్‌లో నేను ముఖాముఖీ సమావేశాలు 27 నిర్వహించాను. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాను. మూడు ప్రత్యేక సదస్సుల్లో పాల్గొని మాట్లాడాను. ఒక సమష్టి సమావేశంలో పాల్గొన్నాను. మంత్రులు లోకేశ్, భరత్ 35 ముఖాముఖీ సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, నాలుగు ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్నారు. 12 దేశాల నుంచి సుమారు 500 మంది భారతీయులు వచ్చారు. అందులో 25శాతం వరకూ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. వారి ఎదుగుదల సంతోషం కలిగించింది. స్థిరత్వం కలిగిన రాజకీయ నాయకత్వం ఉండటంతో భారతదేశానికి మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో వృద్ధి రేటులో చైనాను మన దేశం దాటేసే పరిస్థితి కనిపిస్తోంది’’
వృద్ధిని 15 శాతానికి చేర్చడమే లక్ష్యం
‘‘రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు ఇప్పుడు దావోస్ నుంచి ఏం తెచ్చారని గొంతు చించుకొంటున్నారు గత ఐదేళ్లలో రాష్ట్రానికి కనీసం రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తెచ్చారా? పాతవాళ్లను తరిమేశారు. అమర్‌రాజా వెళ్లిపోయింది. ఇప్పుడు మేం అన్నీ దిద్దుకోవాల్సి వస్తోంది. బ్రాండ్ ఏపీ సర్వనాశనం అయితే దానిని పునరుద్ధరిస్తున్నాం. కుప్పకూలిన వ్యవస్థను దారిలో పెడుతున్నాం. ఇప్పటివరకూ అదే సరిపోయింది. అయినా ఈ కొద్ది వ్యవధిలోనే లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగాం. రాష్ట్రం వృద్ధి రేటును మా గత ప్రభుత్వంలో పదమూడు శాతానికి తీసుకువెళ్తే వైసీపీ హయాంలో అది పది శాతానికి పడిపోయింది. దానిని పదిహేను శాతానికి తీసుకువెళ్లగలిగితే అభివృద్ధిలో అది పెద్ద ముందడుగు అవుతుంది. దానిని నిలబెట్టగలిగితే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ రాష్ట్రం ముందుకు వెళ్లగలుగుతుందని నమ్మకం కలిగించాం. మా ప్రయత్నాలకు కేంద్రం కూడా సహకరిస్తోంది. విశాఖ ఉక్కుకు రూ.పదమూడు వేల కోట్ల సాయం చేయడం మాటలు కాదు.
అమరావతికి, పోలవరంకు కూడా ఆర్థిక సాయం ఇస్తున్నారు. ముందు మనం మన కాళ్ల మీద నిలబడటం ముఖ్యం. అన్నింటికీ కేంద్రం మీదే ఆధారపడలేం. దేశంలో అన్ని రాష్ర్టాలు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాయి. మనది మరీ గడ్డు సమస్య. ముందు ఆక్సిజన్ కావాలి. అందుకే దావోస్ నుంచి వస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను. కేంద్ర ప్రాయోజిత పఽథకాలు నిలిచిపోతే మళ్లీ పునరుద్ధరించాం. ఏఐలో మహారాష్ట్ర ముందుందని అక్కడి సీఎం దావోస్‌లో చెబితే.....మేం పోటీలో ఉన్నామని చెప్పాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ను రమ్మనమని చెప్పాం. అది లాభసాటి కాకపోవడంతో కేంద్రంతో మాట్లాడుతున్నాం’’
కేసులు పెట్టి వేధిస్తే మళ్లీ ఎలా వస్తారు?
‘‘రాజధాని అమరావతి నిర్మాణానికి సహక రించడానికి ముందుకు వచ్చిన సింగపూర్ ప్రభుత్వంపై గత వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మళ్లీ రమ్మంటే రాష్ట్రానికి వస్తారా? సింగపూర్ ప్రభుత్వం ప్రపంచంలోనే విశ్వసనీయత కలిగినది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీ కట్టారు. సైబరాబాద్‌లో కూడా కొన్ని నిర్మాణాలు చేశారు. నేనంటే వాళ్లకు గౌరవం ఉంది. నేను అడగగానే వాళ్ల దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్లాన్ ఉచితంగా తయారు చేయించి ఇచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో పాల్గొని రాజధానిలో కొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పొందారు. వైసీపీ ప్రభుత్వం రాగానే వాళ్ల మీద కేసులు పెట్టి వేధించింది. వీళ్ల అరాచకాన్ని చూసిన తర్వాత మళ్లీ రాష్ట్రానికి వస్తారా? నా మీద కోపంతో అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు. పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టారు. ఇప్పుడు ఎవరినైనా రమ్మంటే గత ప్రభుత్వ వ్యవహారాలు చూసి భయపడుతున్నారు. ‘వాళ్లు మళ్లీ వస్తే ఎలా.’ అని అడుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి అంతగా భయపెట్టింది. ఈసారి రాష్ట్ర ప్రజలు తప్పు చేయరని చెబుతున్నాను’
ఏ కంపెనీకి ఏం కావాలంటే..
‘‘దావోస్ ప్రధానంగా కంపెనీలతో నెట్ వర్కింగ్‌కు సంబంధించిన కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారిని ఒకచోట కలవగలగడం అక్కడ మనకు లభించే అతిపెద్ద సౌలభ్యం. ప్రస్తుతం ప్రపంచస్థాయి కంపెనీలు హరిత ఇంఽథనం, హరిత హైడ్రోజన్, ప్రకృతి వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాయి. కృత్రిమ మేధ పై కూడా బాగా దృష్టి ఉంది. కొన్ని కంపెనీల ఆలోచనలు తెలిసిన తర్వాత వాటి ద్వారా మనం ఏం చేయాలో స్పష్టత వచ్చింది’’ అని చంద్రబాబు తెలిపారు. దావో్‌సలో కలిసిన ఏ కంపెనీ ఏం ఆశిస్తున్నదో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు..
డీపీ వరల్డ్ : చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేసి ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతులు చేస్తోంది. మన వద్ద ఉన్న చిన్న తరహా పరిశ్రమలు ఆ ప్రమాణాలు అందుకొని ఉత్పత్తి చేసేలా చేస్తే ఎగుమతులు బాగా పెంచవచ్చు.
పెప్సికో, వాల్‌మార్ట్, గ్రీన్ మార్ట్ : ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగయ్యే పంటలను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లు పది లక్షల మంది ఉన్నారు. నలభై లక్షలకు వారి సంఖ్యను పెంచాలని చూస్తున్నాం.
బిల్‌గేట్స్ సంస్థ: ఆరోగ్య సంరక్షణ పఽథకాల విషయంలో రాష్ట్రంలో కలిసి పనిచేయడానికి బిల్‌గేట్స్ సంస్థ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. ఆరోగ్య సంరక్షణకు టెక్నాలజీని అనుసంధానం చేసి వ్యాధులు రాకుండా ముందుగానే అప్రమత్తం చేయడం వంటి వాటిని ఇక్కడ అమలు చేసి తర్వాత ప్రపంచం అంతా వ్యాపింపచేయాలని బిల్‌గేట్స్ ప్రతిపాదించారు. ఆయన ఆధ్వర్యంలో డీప్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మేం అనుకొంటున్నాం. భారత దేశంలో దావోస్ సదస్సుకు క్రమం తప్పకుండా వెళ్లడం ప్రారంభించిన తొలి రాజకీయ నేతను నేనే. 1997లో మొదటిసారి నేను అక్కడకు వెళ్లాను. బిల్ గేట్స్ దానిని గుర్తు చేశారు. మొదట్లో హైదరాబాద్‌ను బాగా మార్కెటింగ్ చేశారని...ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ను చేస్తున్నారా అని ఆయన అడిగారు. సర్వ నాశనం అయిన బ్రాండ్‌ను మళ్లీ పునర్నిర్మించడానికి కొంత కష్టపడక తప్పదని ఆయనకు చెప్పాను.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jan 26 , 2025 | 06:21 AM