Share News

Vijayasai Reddy: కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన విజయసాయి

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:35 PM

టీీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో తన రాజీనామా వల్ల లాభం కలుగుతుందనే విషయం తనకు తెలుసని విజయసాయిరెడ్డి తెలిపారు. మూడున్నరేళ్లు రాజ్యసభ సభ్యత్వం మిగిలిఉన్నా రాజీనామా చేయాలనే నిర్ణయం తన వ్యక్తిగత నిర్ణయమని దీనిపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు.

Vijayasai Reddy: కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన విజయసాయి
Vijayasai Reddy

విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ తీసుకున్న నిర్ణయంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడున్నరేళ్ల పదవీకాలం మిగిలిఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కూటమికి లాభం చూకూర్చబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడి పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా కూటమి పార్టీల్లో ఎవరో ఒకరు ఈ పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో రాజ్యసభ అభ్యర్థి ఎన్నిక కోసం పోటీకి దిగలేని పరిస్థితి ఉంటుంది. దీంతో విజయసాయిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీకి నష్టం చేకూర్చే ఉద్దేశంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారంటూ వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇవాళ విజయసాయిరెడ్డి స్పందించారు. తన రాజీనామా విషయంలో ఎవరి ప్రమేయం లేదని, తనపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టంచేశారు. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.


రాజ్యసభ ఛైర్మన్‌కు ఇదే చెప్పా..

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్‌కు తన రాజీనామా లేఖ సమర్పించానని, ఆయన ఆమోదం తెలిపారని మీడియాకు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నారని ఛైర్మన్ అడిగారని, ఎవరి ఒత్తిడితోనైనా ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారని, తనపై ఎవరి ఒత్తిడి లేదని, పూర్తిగా ఇది తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. రాజీనామా విషయాన్ని లండన్‌లో ఉన్న జగన్‌కు ఫోన్ ద్వారా తెలియజేశానన్నారు. తాను ఇకనుంచి రాజకీయాల గురించి మాట్లాడబోనని చెప్పారు. తాను ఇప్పటివరకు అబద్ధాలు ఆడలేదని, నిజాయితీగానే జీవించానని విజయసాయిరెడ్డి తెలిపారు.


కూటమికి లాభమని తెలుసు..

తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కూటమికి లాభమని, వైసీపీకి నష్టమనే విషయం తెలుసని, అయినప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని, రాజకీయాలు చేయబోనన్నారు. కానీ తాను వ్యక్తిగతంగా కొన్ని విషయాలపై పోరాటాన్ని వదిలిపెట్టబోనని తెలిపారు. కూటమి పార్టీల నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కేసుల గురించి బయపడే వ్యక్తిని తాను కాదన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 25 , 2025 | 02:35 PM