National Awards for Handicrafts: చేనేత, హస్తకళలకు అవార్డుల పంట
ABN, Publish Date - Jul 14 , 2025 | 03:00 AM
ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడీవోపీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు పది ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయని..
‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’లో ఏపీకి పది జాతీయ అవార్డులు
నేడు ఢిల్లీలో స్వీకరించనున్న కలెక్టర్లు: మంత్రి సవిత
అమరావతి, పెనుకొండ టౌన్, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ఓడీవోపీ) కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు పది ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయని, ఇందు లో చేనేత, హస్తకళలకు ఏకంగా ఏడు అవార్డులు రావడం హర్షణీయమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మరో రెండు అవార్డులు వ్యవసాయ రంగానికి వచ్చాయని. మరో అవార్డు అంతర్రాష్ట్ర విభాగంలో దక్కిందని చెప్పారు. ఈ అవార్డులను సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఆయా జిల్లాల కలెక్టర్లు అందుకుంటారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఓడీవోపీకి జాతీయ స్థాయిలో మూడు రాష్ట్రాలు ఎంపిక కాగా.. అందులో ఏపీ కూడా ఉందన్నారు. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా ఏటి కొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్‌శారీ, బాపట్ల నుంచి చీరాల సిల్క్‌శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి చీర, నర్సాపురం అల్లికల కుట్టు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు.. అవార్డులకు ఎంపికయ్యాయన్నారు. వ్యవసాయ రంగంలో గుంటూరు మిర్చి, శ్రీకాకుళం జీడిపప్పు చోటు సంపాదించాయని తెలిపారు.
ఆగస్టు 7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్ పథకం: సిసోడియా
సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వ ప్రోత్సాహం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో దక్కిన అవార్డులు నిదర్శనమని చేనేత, జౌళి శాఖ ప్రత్యేక సీఎస్ సిసోడియా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ ఓడీవోపీ కింద గుర్తింపు పొందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవార్డుల ఫలితంగా చేనేత, హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. కళాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుందని వివరించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సిసోడియా వెల్లడించారు.
Updated Date - Jul 14 , 2025 | 03:00 AM