AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో వాదనలు పూర్తి.. మరికాసేపట్లో కోర్టు ఆదేశాలు
ABN, Publish Date - May 26 , 2025 | 03:06 PM
ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులను సిట్ కస్టడీపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.
విజయవాడ, మే 26: ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విచారణ ముగిసింది. వీరి కస్టడీ పిటిషన్లపై సోమవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఆర్డర్ ఇవ్వనుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడు రోజులు, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితోపాటు గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిందితుల కస్టడీ ముగిసిన తర్వాత నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని సిట్‌ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
లిక్కర్ కేసులో విచారణలో అడిగే ప్రశ్నలతోపాటు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ సైతం సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఈ ముగ్గురు సంబంధాలపై ప్రశ్నించాలని ఏసీబీ కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.
ఇక సిట్ తరపు న్యాయవాది వాదిస్తూ..
లిక్కర్ వ్యవహారాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు నడిపించారన్నారు. ఈ ముగ్గురితో పాటు మరోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినీ కస్టడీకి ఇస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు వివరించారు. ఇక లిక్కర్ ద్వారా వచ్చిన లావాదేవీలను గోవిందప్పతో నడిపించారని తెలిపారు. ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు లిక్కర్ కేసుతో సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
నిందితుల తరపు న్యాయవాదులు వాదిస్తూ..
ఈ కేసుతో వీరికి ప్రమేయం లేదన్నారు. పాలసీ రూపకల్పనలో వీరి పాత్ర కూడా లేదన్నారు. కానీ కసిరెడ్డి రాజశేఖరరెడ్డిపై కేసులు పెట్టి కస్టడీకి కోరుతున్నారని చెప్పారు. కస్టడీ పేరుతో కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినీ ఒకసారి కస్టడీలోకి తీసుకుని విచారించారని.. మళ్ళీ కస్టడీ కోరుతున్నారంటూ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. లిక్కర్ స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని అరెస్ట్ చేసి.. అక్రమ కేసులు పెడుతున్నారని కోర్టుకు నిందితుల తరపు న్యాయవాదులు వివరించారు. వీరి వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. మరికాసేపట్లో వీరి కస్టడీపై తీర్పు వెలువరించింది.
Updated Date - May 26 , 2025 | 04:02 PM