Annadata Sukhibhava: రేపటి నుంచి అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల స్వీకరణ
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:36 AM
అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.
అనర్హత సమస్యలు పరిష్కారానికి చర్యలు: వ్యవసాయశాఖ డైరెక్టర్
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): అన్నదాత-సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేస్తామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో డేటా సరిచేయించుకోకపోతే.. అన్నదాత-సుఖీభవ-పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు. భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్‌ల్యాండ్, అడంగల్, 1బీల్లో వారసత్వ వివరాలు చేర్చకపోయినా సమస్య ఏర్పడుతుందన్నారు.
ఆటోమ్యూటేషన్ గ్రామాల్లో 5 వేలపైన సిరీస్ ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది నోషనల్‌గా భావించే అవకాశం ఉండటం, సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్నా.. ఎలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం, డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం విషయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపై వ్యవసాయ అధికారులు పూర్తిఅవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాగా ఉమ్మడి నెల్లూరు, గోదావరి జిల్లాల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉండగా, గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో మరిన్ని సమస్యలు అధికంగా ఉత్పన్నమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రతిబంధకాలను తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 04:36 AM