Amaravati Towers: రాజధానిలో టవర్లకు రైట్ రైట్
ABN, Publish Date - Jun 27 , 2025 | 02:39 AM
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి రూ.3,673.43 కోట్లతో ఎల్-1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ(ఎల్‌వోఏ)ని ఆమోదిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎల్-1 బిడ్డర్లకు ఎల్‌వోఏల అందజేత
3,673 కోట్లతో పనులు అప్పగింత
మౌలిక వసతులకు రూ.1,052 కోట్లు
అమరావతి/విజయవాడ, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి రూ.3,673.43 కోట్లతో ఎల్-1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ(ఎల్‌వోఏ)ని ఆమోదిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపింది. రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్ (జీ+49) నిర్మాణ పనులను ఎన్‌సీసీ లిమిటెడ్‌కు, రూ.1,487.11 కోట్లతో టవర్స్-1, 2 (జీ+39) పనులు షాపూర్జీ అండ్ పల్లోంజీ సంస్థకు, రూ.1,303.85 కోట్లతో టవర్స్- 3, 4 (జీ+39) పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది.
కాగా, సెక్రటేరియట్, హెచ్‌వోడీ టవర్లకు సంబంధించిన ఎల్‌వోఏలను నిర్మాణ సంస్థలకు గురువారం సీఆర్డీఏ కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా సంస్థలకు సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. నిబంధనలు అతిక్రమించినా, కార్మికుల భద్రత విషయంలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, పునర్వినియోగ నీటి లైన్, అవెన్యూ ప్లాంటేషన్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,052.67 కోట్లతో పనులు చేపట్టేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Jun 27 , 2025 | 02:39 AM