CM Revanth Reddy: 18,495 పదోన్నతులు.. 12,472 బదిలీలు!
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:56 AM
గత తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి చేపట్టనున్నారు. నిరుడు సెప్టెంబరు-3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ.. పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, విషయం కోర్టుకు వెళ్లడంతో వాయిదాపడింది.
విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): గత తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి చేపట్టనున్నారు. నిరుడు సెప్టెంబరు-3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ.. పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, విషయం కోర్టుకు వెళ్లడంతో వాయిదాపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగియడంతో దీనిని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నిరుడు పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఈ ప్రక్రియలో మొత్తంగా 12,472 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయనున్నారు.
ఇందులో 1,788 గ్రేడ్-2 గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, 10,684 స్కూల్ అసిస్టెంట్, తత్సమాన హోదాగల ఉపాధ్యాయులు (మల్టీజోన్-1, 2, ప్రభుత్వ యాజమాన్య, మల్టీజోన్-1 పరిధిలోని ఎంపీపీ, జెడ్పీపీ యాజమాన్య ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ బదిలీలతో మల్టీజోన్-1, 2 పరిధిలోని ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ యాజమాన్యాల మొత్తం 1250 మంది గ్రేడ్-2 గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై ప్రభావం పడనుంది. 18,495 ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. ఇందులో 763 గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, 5,123 స్కూల్ అసిస్టెంట్లు, 2,130 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 10,479 భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయులుగా ప్రమోషన్ పొందనున్నారు.
నేటి నుంచి 23 రోజుల పాటు..
బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదలచేసింది. స్కూల్ అసిస్టెంట్, తత్సమాన హోదా ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితా, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఖాళీల వివరాలు, బదిలీల పాయింట్ల వివరాలను ఈనెల 8, 9న ప్రదర్శించాలని విద్యాశాఖ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కరణ, 12న పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. 13-16న ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు పూర్తిచేసి పదోన్నతుల ఉత్తర్వులు అందజేస్తారు. బదిలీలతో ఖాళీ కానున్న ఎస్జీటీ, తత్సమాన ఖాళీల వివరాలను 17న, బదిలీలకు సంబంధించిన తుది జాబితా 18-20లోపు ప్రకటిస్తారు.
21-22లోపు మల్టీజోన్-1 పరిధిలోని జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని ఎస్జీటీలు, తత్సమాన హోదాగలఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందిస్తారు. మల్టీజోన్ పరిధిలోని ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి చేయనున్నారు. మల్టీజోన్-2కి సంబంధించిన ప్రక్రియ శనివారంతో ప్రారంభమై 23 రోజుల పాటు కొనసాగి ఈనెల 30న ముగియనుంది. కాగా, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పునః ప్రారంభించడం పట్ల టీఎస్ యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ షెడ్యూల్ సజావుగా సాగడానికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జంగయ్య, చావ రవి పేర్కొన్నారు.
Updated Date - Jun 08 , 2024 | 03:57 AM