KTR: అవినీతే లేదు.. ఏసీబీ కేసు ఏంటీ?
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:24 AM
ఫార్ములా-ఈ రేసు వ్యవహారాల్లో అసలు అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.
రేసు కోసమే నిర్వహణ సంస్థకు
55 కోట్లిచ్చాం.. ఆధారాలు ఉన్నాయి
ప్రభుత్వ అవగాహన లోపంతోనే నష్టం
ఫార్ములా-ఈ రేసు అంశంపై కేటీఆర్
నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఫార్ములా-ఈ రేసు వ్యవహారాల్లో అసలు అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ కోసం హెచ్‌ఎండీఏ ద్వారా నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లు చెల్లించామని, ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే రేసింగ్ సంస్థతో ఒప్పందం రద్దయిందని, రూ.55 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం, దేశం పరువు తీసిన సీఎం రేవంత్ రెడ్డినే అరెస్టు చెయ్యాలని అన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహనా రాహిత్యం వల్ల ఫార్ములా ఈ వారు కూడా ప్రభుత్వంపై కేసు వేశారని కేటీఆర్ తెలిపారు. కానీ, ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నామనే కడుపు మంటతోనే కేసుల పేరిట ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఉద్యమనాయకుడి బిడ్డనని అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫార్ములా ఈరేసింగ్ వ్యవహారం, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏసీబీకి, పోలీసులకు, న్యాయస్థానానికి అందజేస్తానని కేటీఆర్ తెలిపారు. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటానని ప్రకటించారు. ఈ అక్రమ కేసుపై చట్టపరంగా పోరాటం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
చంద్రబాబు ప్రయత్నాన్ని మేం నెరవేర్చాం
ఫార్ములా-1ను హైదరాబాద్‌కు రప్పించేందుకు 2001లో చంద్రబాబు ప్రయత్నించారని, ఇందులో భాగంగా గోపన్‌పల్లిలో 500 ఎకరాల భూసేకరణకు నిర్ణయించారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా అక్కడ భూములున్నాయని అన్నారు. నాడు చంద్రబాబు చేసిన యత్నానికి బీఆర్‌ఎస్ హయాంలో కార్యరూపం తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ వల్ల నేడు హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణను అడ్డాగా మార్చాలని 2022లోని ఫార్ములా ఈ రేసింగ్‌కు ప్రయత్నిస్తే నిర్వాహకులు ఒప్పుకోలేదని, కానీ సంప్రదింపుల ద్వారా 2023 ఫిబ్రవరి 10న రేస్ నిర్వహించామని తెలిపారు.
రూ.700 కోట్లు లాభం వచ్చింది
ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ.35కోట్లకు పైగా ఖర్చు చేయగా, స్పాన్సర్ అయిన ఏస్‌జెన్ గ్రీన్‌కో సంస్థ రూ.110కోట్లు ఖర్చుపెట్టిందని కేటీఆర్ తెలిపారు. రేసు నిర్వహణ ద్వారా రూ.700 కోట్లు లాభం వచ్చిందని నెల్సన్ అనే సంస్థ నివేదిక కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే, తమకు నష్టం వాటిల్లిందంటూ గ్రీన్‌కో సంస్థ రెండో రేసు నిర్వహణకు ముందు ఒప్పందం నుంచి తప్పుకుందని అన్నారు. మరోపక్క, జూన్‌లో హైదరాబాద్‌లో రేసు నిర్వహించాలంటే డబ్బు ముందుగానే చెల్లించాలని ఫార్ములా ఈ సంస్థ ప్రభుత్వానికి మెయిల్ చేసిందని చెప్పారు. ఈలోగా ఎన్నికల హడావుడి ప్రారంభం కావడం, కొత్త స్పాన్సర్‌ను వెతికే సమయం లేకపోవడం, తామే మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో రెండు విడతల్లో సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో హెచ్‌ఎండీఏ ద్వారా రూ.55కోట్లు చెల్లించామని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ కో ఆర్డినేట్ ఆల్‌బర్టో డిసెంబరు 13న ముఖ్యమంత్రిని కలిశారని, ఆ విషయం బయటికి రానివ్వలేదని ఆరోపించారు. కానీ, ఈవెంట్‌ను మీరు నిర్వహిస్తారా? లేదా? ఈ రేసింగ్‌కు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామంటూ ఎంఏయూడీకి నిర్వహణా సంస్థ మెయిల్ పంపిందన్నారు. మూడో విడత నిధులు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దు చేస్తామని అందులో పేర్కొన్నారన్నారు. దీనికి సంబంధించిన పత్రాలను కేటీఆర్ మీడియాకు చూపించారు. ఫార్ములా ఈ వ్యవహారంలో తనపై నమోదైన కేసులు ఎత్తివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు. న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఏ జడ్జి అయినా కేసు కొట్టేస్తారు
ఫార్ములా- ఈ రేసు కేసులో విషయం లేదని, ప్రభుత్వ ఆరోపణలను పరిశీలిస్తే ఏ జడ్జి అయినా కేసు కొట్టేస్తారని అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ అన్నారు. అందువల్లే ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఫార్ములా-ఈ రేసు అంశంతోపాటు ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపైనా అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ చేశారు.
స్థానిక సంస్థల చట్ట సవరణతో బీసీలకు అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల చట్టాల సవరణలను వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని, 42 శాతం రిజర్వేషన్ హామీ గంగలో కలిసినట్టేనని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లను పక్కన పెట్టేలా ప్రత్యేక బీసీ కమిషన్ కొత్త మెలికలు పెడుతుందని తెలిపారు. ఈ అంశంలో అన్ని పార్టీల మద్దతున్న నేపథ్యంలో చట్ట సవరణలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనే నిబంధన పెట్టి చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇందుకు న్యాయస్థానాలు అంగీకరించకుంటే రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిద్దామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుకుంటే ఈ రాజ్యాంగ సవరణ సాధ్యమన్నారు. అయితే, బీసీలను మోసం చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు ప్రవేశపెట్టిందని, అందుకే తాము వ్యతిరేకించామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టంలో ఉండేలా సవరణలు కోరామన్నారు. ఈ అంశంలో సభలో ఓటింగ్ లేదా డివిజన్ అడుగుతామని కేటీఆర్ ప్రకటించారు.
Updated Date - Dec 20 , 2024 | 03:24 AM