TG News: జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్యపై వేటు..?
ABN, Publish Date - Aug 06 , 2024 | 07:48 PM
జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్యపై వేటుకు జీహెచ్ఎంసీ కమిషనర్ సిద్ధమయ్యారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకుంటూ సీనియర్ ఎంటమాలజిస్ట్. అడ్డంగా బుక్కయ్యారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్ట్ సంధ్య బిల్లులు డ్రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్యపై వేటుకు జీహెచ్ఎంసీ కమిషనర్ సిద్ధమయ్యారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకుంటూ సీనియర్ ఎంటమాలజిస్ట్. అడ్డంగా బుక్కయ్యారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్ట్ సంధ్య బిల్లులు డ్రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మెమో జారీ చేశారు. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలంటూ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌కు కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఎంటమాలజిస్ట్ సంధ్యను విధుల నుంచి తొలగించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు జీఎంచ్‌ఎంసీ యూనియన్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్య అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆమెపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. జీహెచ్ఎంసీలో దోమల కోసం ఫాగింగ్ చేయకుండానే డీజిల్‌ని దుర్వినియోగం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి దర్జాగా అక్రమాలకు పాల్పడుతోంది. ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ తనకు బాగా దగ్గరని, తనకు ఎదురులేదని సదరు అధికారి చెబుతోంది.
తానే కాబోయే చీఫ్ ఎంటమాలజిస్ట్ సంధ్య (సీఈ) నని, దిక్కున్న చోట చెప్పుకొమ్మని హుకూం జారీ చేస్తోంది. ఎన్నికల విధులు, కౌంటింగ్ రోజుల్లోనూ ఫాగింగ్ చేసినట్టు బిల్లులను సదరు అధికారి డ్రా చేసింది. అయితే కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల ఫాగింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లోనే ఉండటం గమనార్హం. ఒక్కొక్కరు గరిష్టంగా పది రోజుల వరకూ ఎన్నికల విధుల్లోనూ ఉన్నట్టు, వారు డబ్బులు తీసుకున్నట్టు సైతం రికార్డులు సృష్టించింది.
ఔట్ సోర్సింగ్‌పై బెదిరింపులు..!!
‘ఆఫ్టరాల్ మీరు ఔట్ సోర్సింగ్.. నా మాట వినకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తా’ అని బెదిరింపులకు దిగింది. డీజిల్ అక్రమాలు, బెదిరింపులు కారణంగానే గతంలో సదరు అధికారి సస్పెండ్ అయింది. జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లను గుప్పిట్టో పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. సీఈ ప్రమోషన్‌లో ఉన్న మరో ఇద్దరు అధికారులు జీహెచ్ఎంసీకి రాకుండా చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.
గతంలో సస్పెండ్ అయినా...
ఐఏఎస్ అధికారి అండదండలతో అడ్డగోలుగా సీనియర్ ఎంటమాలజిస్ట్ రెచ్చిపోతోంది. గతంలో వరంగల్ జిల్లాలోనూ అవినీతి ఆరోపణలపై సదరు అధికారి సస్పెండ్ అయింది. వరంగల్ జిల్లా డీఎంఓ పోస్టు ప్రమోషన్ వచ్చినా.. వెళ్లకుండా డిప్యూటేషన్‌లోనే జోనల్ అధికారిగా కొనసాగుతోంది. సీనియర్ ఎంటమాలజిస్ట్ కంటే డీఎంఓ పోస్టు ఎక్కువ, ప్రమోషన్ వచ్చినా కూడా వెళ్లకుండా ఇక్కడే పనిచేయడం వెనక రహస్యమేంటో... ? తెలియాల్సి ఉంది.
వసూళ్ల పర్వం..
డిప్యూటేషన్‌పై కొనసాగుతూ డీజిల్ కొనుగోళ్లలో అక్రమాలు, ఏఈ, ఎస్ఎఫ్ఏల నుంచి డబ్బుల వసూళ్ల పర్వానికి దిగింది. ప్రతీ రోజూ సగం డీజిల్ మాత్రమే కొనుగోలు చేస్తూ... మిగిలిన డబ్బులు సదరు అధికారి తీసుకుంటుంది. సగటున ఒక్కో ఈఎఫ్ఏ నుంచి రోజుకు రూ.25వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెండేళ్లుగా మరో రెండు మిషన్ల ఆపరేటర్లు లేకపోయినా బిల్లులను సీనియర్ ఎంటమాలజిస్టు డ్రా చేస్తోంది. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఏఈ, ఈఎఫ్ఏలకు వేధింపులు తప్పడం లేదు.
నా వెనుక ఐఏఎస్ ఆఫీసర్..?
‘మీరంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జాబ్ నుంచి తీసేస్తా’ అని హెచ్చరిస్తోంది. తన వెనుక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తోంది. ఎస్ఈని కలిసేందుకు వచ్చే బంధువులు, విజిటర్ల హోటల్ బిల్లులను కూడా ఏఈ, ఎస్ఎఫ్ఏలో చెల్లింపులు చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి. తనను ఎవరూ ఏం చేయలేరని బల్దియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తానే కాబోయే చీఫ్ ఎంటమాలజిస్ట్ నని, ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలంటూ ఇతర జోన్లపైనా సదరు అధికారి ప్రతాపం చూపుతోంది.
Updated Date - Aug 06 , 2024 | 07:48 PM