Delhi: మంత్రివర్గ విస్తరణకు వేళాయె..
ABN, Publish Date - Aug 23 , 2024 | 03:53 AM
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా!
నేడు రాహుల్, ఖర్గేతో రేవంత్ టీమ్ భేటీ
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన రేవంత్‌తోపాటు.. రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆరుగంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయల్దేరనున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో.. రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కానున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం మధ్యాహ్నం భేటీ అవుతున్నందున.. ఉదయమే తెలంగాణ నేతలతో సమావేశం జరగవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం దక్కవచ్చునని భావిస్తున్నారు.
ఈ మేరకు.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ప్రేమసాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలూ నాయక్ లేదా రాంచందర్ నాయక్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తదితరుల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. కాంగ్రె్‌సలో చేరే ముందు మంత్రి పదవి ఇస్తారని వాగ్దానం చేశారు కనుక తన పేరు జాబితాలో ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వసిస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ.. ఎస్టీల నుంచి బలరాం నాయక్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభకు, సచివాలయంలో రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించనున్నారు.
ఒకే వేదికపై రేవంత్, చంద్రబాబు
25న ‘శాంతి సరోవర్’కు ఇద్దరు సీఎంలు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ఒకే వేదికను పంచుకోనున్నారు. హైదరాబాద్‌లోని శాంతి సరోవర్ అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 25వ తేదీ(ఆదివారం) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వారితో పాటు బ్రహ్మకుమారి సమాజం హైదరాబాద్ విభాగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Updated Date - Aug 23 , 2024 | 03:53 AM