Fengal Cyclone: ఏపీలో ఫెంగల్ తుఫాను బీభత్సం.. ఈ జిల్లాల్లో భారీవర్షాలు ...
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:12 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది.
ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుఫాన్ నేపథ్యంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని కోరారు. కాగా, తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్, పార్కులు తడిసి ముద్దయ్యాయి. చలి గాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు.
సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు. సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు.
మరోవైపు ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి.
టి.నగర్ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది.
మూడు రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
మరోవైపు, తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి.
చెన్నైవ్యాప్తంగా వరదనీరు చేరడంతో ఉపాధిలేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశముందనే కారణంగా శనివారం చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Dec 02 , 2024 | 02:15 PM