GI Tag Sweets India: ‘తీపి’ కబుర్లు
ABN, Publish Date - Jan 01 , 2026 | 06:07 AM
బిహార్‌లోని నలందా జిల్లాలో సిలావ్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ ‘శ్రీకాళీ ఖా’ అనే స్వీట్ షాపులో తయారుచేసే ‘కాజా’కు ఈ మధ్యనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ వచ్చింది. ఒక వంటకానికి...
బిహార్‌లోని నలందా జిల్లాలో సిలావ్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ ‘శ్రీకాళీ ఖా’ అనే స్వీట్ షాపులో తయారుచేసే ‘కాజా’కు ఈ మధ్యనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ వచ్చింది. ఒక వంటకానికి జీఐ ట్యాగ్ రావటం చాలా అరుదైన విషయం. ఈ ఊరులో తయారుచేసే కాజాలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. మోదీతో సహా అనేకమంది రాజకీయ నాయకులు ఈ కాజా గురించి తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు, ప్రశంసించారు. ఈ కాజాకు జీఐ ట్యాగ్ ఇచ్చిన వార్త, నేను ఢిల్లీలో ‘వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్’ సమావేశంలో ఉన్నప్పుడు తెలిసింది. వెంటనే, ‘మన తెలుగు వాళ్లకు ఏం తక్కువ.. మనకెందుకు ఇలాంటి ట్యాగ్‌లు రావటం లేదు’ అంటూ అనేక ఆలోచనలు కలిగాయి. తాపేశ్వరం కాజా.. ఆత్రేయపురం పూతరేకులు.. గొల్లలమామిడాడ ఇమ్మర్తిలు.. బందరు హల్వా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వందల వంటకాలు మన దగ్గర ఉన్నాయి. వీటన్నింటికీ కూడా జీఐ ట్యాగ్‌లు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు తలుచుకుంటే కష్టం కూడా కాదు. ఎక్కడి దాకానో ఎందుకు.. తాపేశ్వరం కాజాను సుమారు 80 ఏళ్ల క్రితం మా నాన్నగారు పోలిసెట్టి సత్తిరాజు తయారుచేశారు. ఇప్పటికీ నాతో పాటు అనేకమంది కుటుంబ సభ్యులు ఈ వ్యాపారంలో ఉన్నారు. లెక్క ప్రకారం మనకు కూడా జీఐ ట్యాగ్ దక్కాలి కదా.. దక్కితే మన తెలుగు రాష్ట్రాలకే ఖ్యాతి వస్తుంది కదా.. ఈ దిశగా విధానకర్తలు, మిఠాయి వ్యాపారులు, పౌరసమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఒక స్వీటుకు జీఐ ట్యాగు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి? అనే భావనలో ఉంటారు. కానీ మన దేశంలో మిఠాయి వ్యాపారం ఎంత పెద్దదో.. ప్రతి ఏడాది దీని ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తోందో చాలా తక్కువ మందికి తెలుసు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం– మన దేశంలో 90 శాతం మిఠాయి వ్యాపారులు ప్రభుత్వ పన్నులు కట్టే పరిధిలో లేరు. అంటే వారు ఎంత వ్యాపారం చేస్తున్నారో మనకు తెలియదు. మిగిలిన 10 శాతం వ్యాపారులు– 2021 లెక్కల ప్రకారం, ఆ ఏడాది రూ. 59,300 కోట్ల రూపాయల వ్యాపారం చేశారు! దీనిలో 13 శాతం వ్యాపారం మన దక్షిణాదిన జరుగుతోంది. ఇక దేశంలో మిగిలిన 90 శాతం మంది చేసే వ్యాపారం మరో నాలుగు రెట్లు వేసుకుందాం. అంటే మన దేశంలో 2021లో 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు లెక్క. గణాంకాల ప్రకారం, ఈ వ్యాపారం ప్రతి ఏడాది 12 శాతం పెరుగుతోంది. దీని ఆధారంగా చూస్తే 2025 నాటికి మన దేశంలో మిఠాయి వ్యాపారం నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్నట్లు అంచనా కూడా. ఈ వ్యాపారులందరూ ఏడాదికి ఒకసారి ‘వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్’లో కలుస్తారు. గతవారం జరిగిన ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సుగర్ ఫ్రీ మిఠాయిలు.. ప్యూజన్ స్వీట్లకు పెరుగుతున్న డిమాండ్.. ఆధునిక పరిశుద్ధమైన ప్యాకింగ్.. ఈ కామర్స్ సమస్యలు వంటి అంశాలపై కీలకమైన చర్చలు జరిగాయి.
మన దేశ జనాభాలో 50శాతం మంది 40 ఏళ్ల లోపు వారే! వీరికి ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ. మిఠాయిలు తినడం వల్ల అనారోగ్యం కలుగుతుందనే ప్రజల భావన కారణంగా సుగర్ ఫ్రీ స్వీట్స్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. దీంతో అన్ని పెద్ద బ్రాండ్స్– సుగర్ ఫ్రీ స్వీట్స్‌ను ప్రవేశపెట్టాయి. వీటితో పాటుగా కొత్త తరం ప్యూజన్ స్వీట్లను కూడా ఇష్టపడుతున్నారు. రసగుల్లా చీజ్ కేక్, గులాబ్ జామూన్ ట్రఫుల్, జిలేబీ వాఫిల్స్ వంటివి ఇప్పుడు చిన్న నగరాలలో కూడా లభిస్తున్నాయి. విద్యాధికులైన అనేక మంది మిఠాయి షాపుల యజమానులు సంప్రదాయ వంటలకు కొత్త రంగులు.. హంగులు అద్దడం మొదలుపెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిమంది ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక మిఠాయి షాపు యజమానులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్యాకింగ్. స్వీట్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచగలిగితే– వ్యాపారంలో నష్టాలు ఉండవు. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యాక్యూమ్ సీల్డ్ ప్యాకేజింగ్ వంటివి అందుబాటులోకి వచ్చేశాయి. కొద్దిపాటి పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇన్‌స్టా మార్కెటింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు చూసి, ఆన్‌లైన్ ద్వారా స్వీట్లను కొనుగోలు చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ ప్రకటనకర్తల్లో ఎక్కువ మంది ఇతర షాపుల నుంచి కొనుగోలు చేసి తమ బ్రాండ్‌లపై అమ్మేవారే! ఈ ఇన్‌స్టా మార్కెటింగ్ వల్ల, స్థానికంగా ఉండే చిన్న షాపులకు బిజినెస్ తగ్గుతోంది. అబద్ధపు ఇన్‌స్టా ప్రకటనలు కూడా సైబర్ నేరాల కిందే వస్తాయి. వీటిని ప్రభుత్వం నియంత్రించాల్సి ఉంది. ఇక పెద్ద నగరాల్లో అయితే జొమాటో, స్వీగ్గి వంటి డెలివరీ ప్లాట్‌ఫాంలకు విపరీతమైన ఆదరణ ఉంది. విదేశాలకు కూడా సులువుగా మన మిఠాయిలను అందించే సప్లైయర్స్ వచ్చేశారు. ఇలాంటి అవకాశాలన్నింటినీ వాడుకుంటేనే ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించగలం. లేకపోతే ఎదుగుదల లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. చివరగా– అన్ని రంగాల్లో మాదిరిగానే మిఠాయి వ్యాపార రంగంలో కూడా పెను మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. వీటిని గమనించి.. వాటిపై అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుంది.
మల్లిబాబు
ఎండీ, సురుచి ఫుడ్స్
వైస్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కీన్ మాన్యుఫాక్చరర్స్
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..
Updated Date - Jan 01 , 2026 | 06:07 AM