New Year Reflections: కొత్త సంవత్సరమూ పాత ఆలోచనలూ
ABN, Publish Date - Jan 01 , 2026 | 06:12 AM
ఇవాళే కొత్త సంవత్సరం వచ్చింది. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షల మెసేజీలు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరపు తొలిపొద్దు పొడవగానే నా జీవితంలో క్రాంతి రావాలని, నా ఆలోచనలు మారాకు....
ఇవాళే కొత్త సంవత్సరం వచ్చింది. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షల మెసేజీలు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరపు తొలిపొద్దు పొడవగానే నా జీవితంలో క్రాంతి రావాలని, నా ఆలోచనలు మారాకు వేసి, మరిన్ని మార్పులకు స్వాగతం పలకాలనీ వారంతా అభిలషించారు. తెల్లవారింది. పాత సంవత్సరంలో ఆఖరి రోజున చేసినట్లుగానే– ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి, పసుపు, మెంతులు వేసుకుని తాగాను. అచ్చం నిన్నటిలాగే హార్లిక్స్ సేవనం, మార్నింగ్ వాక్, కాస్త స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు, స్నానం, అల్పాహారం, పడక్కుర్చీలో నడుం వాల్చి, లోకపు తీరు గురించి ఆలోచనలో పడడం... అంతా సేమ్ టు సేమ్! మార్పెక్కడుంది? క్యాలెండరులో మరో పేజీ చిరిగింది అనేవారు పాతకాలపు కథల్లో. ఈ రోజుల్లో గోడలకు క్యాలెండర్లు లేవు. సెల్‌ఫోన్‌లోనే డేటు చూస్తాం. అది తనంతట తనే మార్చేసుకుంటుంది. చించే, ఆలోచించే పని మనకు పెట్టదు. మరి పెనుమార్పు వచ్చేస్తుందని ఆకాంక్షించిన నా బంధుమిత్రుల మాటేమిటి? ఇంతకీ ఈ మార్పు వున్నట్టా? మరి లేనట్టా? ప్రబంధ నాయిక నడుముకు వచ్చిన సమస్యే మనకూ వచ్చినట్లుగా వుంది.
గ్రీకు తత్త్వవేత్త హెరాక్లిటస్ అంటాడు– ‘ఒకే నదిలో రెండుసార్లు కాలు పెట్టలేవు’ అని. అంటే మొదటిసారి కాలు పెట్టి, బయటకు తీసి, మళ్లీ పెట్టే లోపున పాత నీరు వెళ్లిపోతుంది. కొత్త నీరు వచ్చేస్తుందని అర్థం. చూడడానికి పాత నీరులాగే అనిపిస్తుంది కానీ, నిజానికి అది కొత్త నీరు. దానికీ, దీనికీ లింకు ఉంది కానీ, దేని అస్తిత్వం దానిదే. రెండూ ఒకలాంటివి కావు. 1940–60ల మధ్య కాలంలో పుట్టిన వారికున్న అడ్వాంటేజీ ఏమిటంటే... వాళ్లు కనీసం ఆరు వేర్వేరు దశాబ్దాలు, రెండు వేర్వేరు శతాబ్దాలు, రెండు వేర్వేరు సహస్రాబ్దాలను చూశారు. కాలచక్రపు తానులో ఈ ఆరు దశాబ్దాల కాలాన్ని ఒక కట్‌పీస్‌గా తీసి చూస్తే దీనిలో ఉన్నంత వర్ణ వైవిధ్యం తక్కిన ఏ ఆరు దశాబ్దాల కట్‌పీస్‌లోనూ కనబడదు. ఏం మార్పు! ఏం మార్పు!!
పక్కూరికి ఫోన్ చేసినా, గొంతు చించుకోవలసిన కాలం నుంచి, సప్త సముద్రాల అవతల ఉన్నవారిని కూడా వాట్సాప్ దివ్యదృష్టితో చూసి, పలకరించగలిగే సౌకర్యాన్ని సామాన్యుడికి కల్పించిన కాలమిది. ‘సినిమా చూడడమంటే థియేటర్‌కు వెళ్లాలి, తెరపై బొమ్మ పడాలి. రీల్ కట్ అయితే ఉస్సూరుస్సూరనాలి’ అనే స్టేజీ నుంచి అరచేతిలో అంజనం వేసినంత సులభంగా సెల్‌ఫోన్‌లో సినిమాలు చూసేస్తున్న కాలమిది. వినైల్ గ్రామ్‌ఫోన్ రికార్డుల నుంచి ఆన్‌లైన్ సంగీతం వరకు– ఉత్తరాలు రాయడం దగ్గర్నుంచి, ఈమెయిల్, వాట్సాప్‌ల వరకూ– రేడియోలో క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానాన్ని వినడం నుంచి 3D, HD టీవీల్లో ఆటను కళ్లారా చూడడం వరకు. అంతేనా, వీడియో క్యాసెట్‌ల నుంచి ఓటీటీలో చిత్రాలు చూడడం వరకు– పంచ్ కార్డులు, ఫ్లాపీ డిస్క్‌లను ఉపయోగించడం నుంచి గిగాబైట్, మెగాబైట్‌లతో స్మార్ట్‌ఫోన్‌ల వరకు– సైకిళ్ల నుంచి మోటారు సైకిళ్లు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల వరకు సామాన్యులూ ఎదిగారు. ఒకప్పటి ప్రాణాంతకమైన అంటు రోగాలు ఇప్పుడు అదుపులోకి వచ్చేశాయి.
మార్పులో ఇదొక పార్శ్వమైతే, మరొక పార్శ్వం కూడా వుంది. అది– తను తినడానికి ముందు మనిషి ఇతరుల ఆకలి గురించి ఆలోచించిన కాలం, ఇరుకిళ్లలో ఉంటూనే ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టాలని తాపత్రయపడిన కాలం, డిగ్రీలతోనే పాండిత్యాన్ని, జీతంతోనే మనిషి విలువను కొలవని కాలం, గూగులమ్మ లేకుండానే జ్ఞానాన్ని సంపాదించిన కాలం, క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలిగిన కాలం, మొబైల్ చూడకుండా ఫోన్ నెంబర్లు గుర్తు పెట్టుకున్న కాలం, జీపీఎస్ లేకుండా గమ్యాలకు చేరిన కాలం, రీల్స్ ద్వారా కాకుండా మనుషుల ముఖతః జోకులు విన్న కాలం, ఏసీలు లేకుండా ఫ్యాన్లతోనూ, చెట్లనీడన కాలక్షేపం చేసిన కాలం, మినరల్ వాటర్, విటమిన్ సప్లిమెంట్లు అవసరం పడని కాలం, స్విగ్గీవాడు సమయానికి చేరకపోతే ముద్దకు నోచుకోలేమని భయపడని కాలం, ఆరేళ్ల వరకు బడి భయం లేకుండా, బాల్యమంటే ఆటలాడుకోవడమే అని నమ్మిన కాలం, రోగమొస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవలసి వస్తుందని భయపడని కాలం, వ్యాయామానికి ప్రత్యేకంగా జిమ్‌లకు వెళ్లవలసిన అవసరం పడని, ఒళ్లు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ల అగత్యం పడని కాలం!
ఇలా చెప్తూపోతే... పాత తరం వాళ్లు ఔనౌనంటూ తల ఊపుతారు, కొత్తతరం వాళ్లు విసుక్కుంటారు. ఏ తరానికి ఆ తరం తమది మరే ఇతర తరంతోనూ పోల్చడానికి వీల్లేని ప్రత్యేకమైన తరం అనుకుంటుంది. షేక్స్‌పియర్ చెప్పినట్లుగా, అసలు సమస్య అక్కడే ఉంది! ప్రతి తరం ఒకే రకమైన బలహీనతతో బాధపడుతుంది. తాము మెచ్చిన ఘంటసాల లేదా బాలూ పాట తర్వాత వచ్చిన సినిమా పాటలన్నీ భ్రష్టుపట్టిపోయాయని, తాము మెచ్చిన యద్దనపూడి లేదా యండమూరి తర్వాత వచ్చిన సాహిత్యమంతా చదవనక్కరలేని చెత్త అనీ, తామభిమానించిన రాజకీయ నాయకుల తర్వాత వచ్చిన వారందరూ చేతకాని వారనీ– ఇలా!
మనసెప్పుడూ... అవే పాత ‘మంచి’ రోజుల కోసం, పాత ‘శ్రావ్యమైన’ పాటల కోసం, పాత ‘ప్రయోజనకరమైన’ సాహిత్యం కోసం, పాత ‘రుచికరమైన’ వంటకాల కోసం వెంపర్లాడుతుంది, ఆరాటపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తకి మారాల్సి వచ్చినప్పుడు కూడా పాతది కంటిన్యూ అయితే బాగుణ్ననిపిస్తుంది. సెల్‌ఫోన్‌లో యాప్ తనను అప్‌డేట్ చేసుకోమన్నప్పుడు, లాప్‌టాప్ కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోమని, లేకపోతే అడుగు ముందుకు పడనివ్వనని మొరాయిస్తున్నప్పుడు చికాకేస్తుంది. ఎందుకంటే కొత్త ఫార్మాట్ అనగానే పాత ఐకాన్లన్నీ ఎడమ నుంచి కుడికీ, కుడి నుంచి ఎడమకూ, పై నుంచి కిందకూ, కింది నుంచి పైకి మారడమే కాదు– రంగులూ, పేర్లూ కూడా మార్చేసుకుంటాయి. చచ్చీచెడి దీనికి అలవాటయ్యే లోపున లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోమనే సతాయింపు ప్రారంభమవుతుంది. కొత్తంటే భయపడడమనే దానికి ‘జినోఫోబియా’ అనే పేరు ఎప్పుడో పెట్టారు. కొత్త వెర్షన్ల డౌన్‌లోడ్ అంటే భయపడడానికి వేరే ఏదైనా పేరు కనిపెట్టాలి! ఏ లింకు ఓపెన్ చేస్తే, ఏది డౌన్‌లోడ్ చేసుకుంటే సమాచారం చోరీ, బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుందోనన్న భయమొకటి నిరంతరం వెంటాడుతోంది. ఈ సంక్లిష్ట, ఆందోళనాభరిత జీవితం కంటే... సరళంగా, గందరగోళ రహితంగా సాగిపోయిన పాత జీవితమే మెరుగనిపిస్తోంది. గుండెలు పీచుపీచు మనిపించే ఈ సాంకేతికత కంటే పాత కాలపు సంప్రదాయ బద్ధమైన లావాదేవీలే హాయనిపిస్తోంది.
‘‘దూర్ గగన్ కీ ఛావ్ మేఁ’’ అనే హిందీ సినిమాలో నా అభిమాన గాయకుడు కిశోర్ కుమార్ ఎప్పుడో పాడేశాడు– ‘కోయీ లౌటా దే మేరే బీతే హుయే దిన్’ (అంటే... గడిచిపోయిన రోజులను నాకు ఎవరైనా తిరిగి యివ్వండి) అని. ఇది 1964 నాటి సినిమా. అప్పటికి బీతే హుయే దిన్ అంటే ఏ 40, 50ల రోజులై ఉంటాయి. నాకు మరీ అంత దురాశ లేదు. 1980–90లవి తిరిగిస్తే చాలు. ఏదో కాస్త ఆధునికత, కాస్త ప్రాచీనత! సర్దుకుంటాను. కానీ అవీ తిరిగి రావని తెలుసు. మన చేతిలో నిన్న లేదు, రేపూ లేదు, ఉన్నది వర్తమానం ఒక్కటే. కానీ షెల్లీ చెప్పినట్లు చేతిలో ఉన్నదాన్ని పట్టించుకోకుండా, లేని వాటి కోసం పరితపిస్తాం.
అక్కినేని నాగేశ్వరరావు గార్ని ఓ ఫంక్షన్‌లో కలిశాను. అప్పటికే ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన ప్రసంగంలో ఆయన తను యింకెంతకాలం జీవిస్తాననేది ముఖ్యం కాదని, ఉన్నంతకాలం ఆ వ్యాధితో పోరాడానా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు. ‘వంద సంవత్సరాలు నక్కలా బతకడం కంటే, ఒక్క రోజు సింహంలా బతకడం మేలు’ అన్నాడట టిప్పు సుల్తాన్! నాగేశ్వరరావుగారి గతం ఎంతో ఘనం. దాన్ని తలచుకుని కృంగిపోలేదు. రేపు ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో లేదో అని బెంగ పెట్టుకోలేదు. ఇవాళ ఉంది, ఇలా ఉంది. దీనితో ఎలా వ్యవహరించాలి అనే దానిపైనే ఆయన ఫోకస్.
గడిచిపోయిన రోజుల జ్ఞాపకాలు అందించే వెచ్చదనాన్ని, సౌఖ్యాన్ని అప్పుడప్పుడు ఆస్వాదించడం అవసరమే. చిన్నపిల్లలు పిప్పర్‌మెంట్‌ను కాస్సేపు చప్పరించి, రేపు మళ్లీ చప్పరించడానికి గూట్లో దాచుకున్నట్లు... మనం కూడా గతాన్ని భద్రంగా జ్ఞాపకాల పేటికలో దాచుకోవాలి. ఇవాళ్టికీ జీవించే అవకాశాన్ని ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వర్తమానాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించాలి. హిందీ సినిమా ‘‘వక్త్’’లో సాహిర్ అంటాడు– ‘ఆగే భీ జానే న తూ, పీఛే భీ జానే న తూ..’ అని. ‘రేపటిలోకి దూసుకుని వెళ్లడమూ నీ తరం కాదు, నిన్న లోకి ముడుచుకుపోవడమూ నీ తరం కాదు, నీ చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఏవైనా ఆశలుంటే యిప్పుడే తీర్చుకో’ అంటాడు కవి. తెలుగులో కూడా ఒక పాట చరణంలో ‘నిన్న మరల రాదు, రేపు మనది కాదు, నేడే నిజం’ అని. మహానుభావుడు గాలిబ్ ఎప్పుడో చెప్పాడు– ‘హాల్ సే లుఫ్త్ అందోజ్ హూఁ, ఔర్ ముస్తకబిల్ కే గాలిబ్ శర్ కీ ఫికర్ న కరూఁ’ అని. నేను వర్తమానం నుంచే ఆనందాన్ని పొందుతున్నాను. రేపేదో కష్టం వచ్చి పడుతుందన్న ఆందోళనను దరిచేరనివ్వను అంటాడు.
మనమూ అదే ధోరణి అలవర్చుకోవాలి. 2026లో మరో కరోనా వస్తుందా? గ్లోబల్ వార్మింగ్ వలన హిమాలయాలు కరిగి వరదలు ముంచెత్తుతాయా? సూర్యకాంతిలో వేడి తగ్గి, మొక్కలు పెరగడం మానేస్తాయా? కుజగ్రహ శకలం భూమిని ఢీ కొట్టి మూడు వంతుల జనాభా భస్మమై పోతుందా? అగ్రదేశాలు అణ్వస్త్ర యుద్ధానికి పాల్పడతాయా? మన రాశ్యాధిపతులైన గ్రహాలు తమలో తాము కలహించుకుని మన కొంప ముంచుతాయా? ధర పెరిగి, వెండే బంగారమవుతుందా?– ఇలాంటి థంబ్‌నెయిల్స్‌తో పుంఖానుపుంఖాలుగా వచ్చి పడే యూట్యూబ్ వీడియోల జోలికి పోకుండా హాయిగా ఈ రోజును, ఈ సంవత్సరాన్ని ఎంజాయ్ చేయండి. ఇవే నా శుభాకాంక్షలు.
డా. మోహన్ కందా
విశ్రాంత ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆం.ప్ర. ప్రభుత్వం
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..
Updated Date - Jan 01 , 2026 | 06:12 AM