MLIFF Toll System: కొత్త ఏడాదిలో మరో రహదారి దోపిడీ
ABN, Publish Date - Jan 01 , 2026 | 06:04 AM
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్) పేరుతో కేంద్ర ప్రభుత్వ భూ రవాణా శాఖ మరో దోపిడీకి తెరలేపనున్నది. ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ పద్ధతి మొదలవుతుందని కేంద్రమంత్రి గడ్కారీ ఇటీవల...
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్) పేరుతో కేంద్ర ప్రభుత్వ భూ రవాణా శాఖ మరో దోపిడీకి తెరలేపనున్నది. ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ పద్ధతి మొదలవుతుందని కేంద్రమంత్రి గడ్కారీ ఇటీవల లోక్‌సభలో ప్రకటించారు. ఇదివరకు బీఓటీ (బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) విధానంలో రహదారులు నిర్మించి, టోల్ వసూలు చేసినప్పుడు టాగ్ లేకుండా మాన్యువల్‌గా టాక్స్ వసూలు చేసేవారు. అయితే దీని వల్ల ఆలస్యం అవుతుందని, అందువల్ల ఫాస్ట్‌టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నామనీ ప్రకటించి వాహన యజమానులతో ఫాస్ట్ టాగ్ స్టికర్లు కొనిపించింది ప్రభుత్వం. ఈ ఫాస్ట్‌టాగ్ కొనుగోలుకు ఒక్కొక్క వాహన యజమాని నుంచి తిరిగి చెల్లించని డిపాజిట్ రూ.500 నుంచి 1000 వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు వసూలు జరిగింది. టోల్ అకౌంట్లో కనీసం 500 రూపాయల బ్యాలెన్స్ వుంచాలనీ, లేనిపక్షంలో రెట్టింపు టాక్స్ వసూలు చేయాలనీ నిబంధన పెట్టడం వల్ల వాహనదారులు లక్షల రూపాయలను అనవసరంగా అకౌంట్స్‌లో నిల్వ ఉంచుతున్నారు.
తాజాగా కొత్త సంవత్సరంలో ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ విధానం అమలయ్యే పక్షంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫాస్ట్‌టాగ్ స్టికర్లు ఉపయోగపడవు. ఈ విధానంలో టోల్‌గేట్ల వద్ద నేషనల్ హైవే అధికారులు పెద్ద ఏంటెనా, ఆటోమ్యాటిక్ నెంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు చేసి టోల్ టాక్స్ వసూలు చేస్తారు. అందుకు తగినట్టు వాహన యజమానులు వాహనాల నెంబరు ప్లేట్‌లు కెమెరాకు కనిపించే విధంగా మార్పుచేయాలి. దాంతో మరలా వాహనదారులు వెయ్యి రూపాయల చేతి చమురు వదుల్చుకోవాలి. ఈ నెంబరు ప్లేట్‌కు ఎంత వసూలు చేస్తారో, నెంబరు ప్లేట్ సప్లయ్ చేసే కాంట్రాక్టును ఏ బడాబాబుకు ఇస్తారో వేచి చూడాలి. నిజానికి అసలు టోల్ గేట్ వసూలు చేయకూడదు. తొలుత స్వర్ణచతుర్భుజి పథకంలో జాతీయ రహదారులను బీఓటీ పద్ధతిలో నిర్మించినప్పుడు, టోల్ టాక్స్ ఇరవై ముప్పై ఏళ్ళ పాటు మాత్రమే ఉంటుందనీ, ఆ తర్వాత ఉండదనీ ప్రకటించారు. కానీ టోల్ టాక్స్‌ల ద్వారా లక్షల కోట్ల ఆదాయానికి అలవాటు పడిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక హక్కుగా భావించి నిరంతరం వసూలు చేస్తూనే ఉంది.
వాహనం కొన్నప్పుడు 18శాతం జీఎస్టీతో పాటు రోడ్ టాక్స్ కూడా వసూలు చేస్తారు. అంతేగాక జాతీయ రహదారుల అభివృద్ధికి గాను కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై రోడ్ డెవలప్‌మెంట్ సెస్‌ను విధిస్తోంది. ఈ టాక్స్ ద్వారా ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. నిబంధనల ప్రకారం ఈ నిధులను రోడ్ల అభివృద్ధికి వాడాలి. కానీ ఆ నిధులను ఇతర అవసరాలకు వాడుతున్నారు.
ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ విధానం గురించి కేంద్రమంత్రి గడ్కారీ లోక్‌సభలో మాట్లాడుతూ దీనివల్ల దేశవ్యాప్తంగా 1500 వందల కోట్ల ఇంధనం ఆదా అవుతుందని ప్రకటించారు. వెనక నుంచి ఏనుగులు పోయినా ఫర్వాలేదు, ముందు నుంచి పిన్నులు కూడా పోకూడదన్నట్టుగా ఒకపక్క వాహనదారులపై లక్షల కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేస్తూ మరోపక్క రూ.1500 కోట్ల ఇంధనం పొదుపు అవుతుందని ప్రకటించడం హాస్యాస్పదం!
అన్నవరపు బ్రహ్మయ్య
సీనియర్ పాత్రికేయులు
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..
Updated Date - Jan 01 , 2026 | 06:04 AM