లిట్టీచోఖాలనే అంగారపూల కథ..
ABN, Publish Date - Sep 14 , 2025 | 11:52 AM
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.
శుద్ధ గోధూమచూర్ణం తు సాంబు
గాఢం విమర్దయేత్
విధాయవటకాకారం నిర్థూమే అగ్నౌ
శనైః పచేత్
శుద్ధ గోధుమపిండిని తడిపి మర్దించి నిమ్మ కాయంత ఉండలు చేసి నిప్పుల మీద తక్కువ సెగపై నెమ్మదిగా కాల్చినది లిటి అంటుంది భోజన కుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథం.
‘‘నిర్థూమే అగ్నౌ శనైః పచేత్’’ అంటే, పొగవాసన తగిలేలా నిప్పులమీద కాల్చాలనేది ప్రత్యేకంగా చెప్పిన విషయం. ఇంట్లో ఓవెన్ లోనో గ్యాస్ పొయ్యి మీదో గ్రిల్ పెట్టి కాలిస్తే దానికి పొగవాసన ఉండదు. మండుతున్న బొగ్గులమీద కాల్చినప్పుడే అసలైన లిట్టీ రుచి తెలుస్తుంది. ‘లిట్టీచోఖా’ అనేది బీహారు, జార్ఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన వంటకం. ఆవనూనెతో చేసిన చోఖా అనే చట్నీతో లిట్టీలను నంజు కుంటారు. పొగదనం, కమ్మ దనం కలగలసిన వంటకం లిట్టీచోఖా. పంచమహా భూతాల సమ్మేళనంగా వాళ్లు దీన్ని భావిస్తారు.
కాలక్రమంలో లిట్టీ తయారీలో అనేక మార్పు లొచ్చాయి. గోధుమపిండిలో వాము, అల్లం, ఇంగువ, జీలకర్ర లాంటి సుగంధ ద్రవ్యాలను కలపటం ఒకటైతే, గోధుమపిండి లోపల రకరకాల కూరగాయలను పొదిగి లిట్టీలను కాల్చటం ఇంకొకటి.
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి. ఇప్పుడు గోధుమపిండిని పైపైన పూరీలాగా వత్తి, దానిపైన ఈ శనగపిండి ముద్దని ఉంచి పూరీని మూసేసి చేత్తో గుండ్రని బంతిలా చెయ్యండి. ఇలా చేసిన బంతుల్ని కుంపట్లో మండుతున్న బొగ్గులపైన ఇనుప జల్లెడ ఉంచి గానీ నేరుగా గానీ తిప్పుతూ కాల్చాలి. సన్న సెగపై కనీసం అరగంటసేపు ఇలా కాలుస్తారు. గోధుమపిండితోపులో శనగపిండి మసాలాల మిశ్ర మాన్ని పొదిగి నిప్పులపైన కాల్చినది లిట్టీ!
‘చోఖా’ తయారీ కూడా ఇలానే ప్రత్యేకంగా ఉంటుంది. వంకాయల్ని గానీ, టమాటాల్ని గానీ, బంగాళాదుంపల్ని గానీ, నిప్పుల మీద కాల్చి వాటిలోపలి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుంటారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఆవ నూనె ఇందులో కలిపి బాగా చిలుకుతారు. ఇదే చోఖా అనే బజ్జీ పచ్చడి. లిట్టీని చోఖాతో నంజుకుంటే సంపూర్ణ భోజనం అవుతుంది.
లిట్టీల్ని తినే ముందు వేళ్లతో గట్టిగా నొక్కి ముక్కలుగా చేసి ఒక్కో ముక్కని నేతిలో ముంచుకుని, చోఖా ముద్దతో కలిపి తింటారు. అన్ని సీజన్లకూ తగిన ఆహార పదార్థం ఇది. ఉత్తర ప్రదేశ్‌లో వీటినే బాటీ లంటారు. కానీ, లోపల పూర్ణంలేకుండా సాదా బాటీలను అక్కడ ఎక్కువగా ఇష్టపడతారు.
‘‘అంగార కర్కటీయం బృంహణీ శుక్రలా లఘుః దీపనీ కఫకృద్బల్యా పీనస శ్వాస కాస జిత్’’ లిట్టీ బలకరమైన వంటకం అనీ, పురుషుల్లో జీవకణాలను పెంచుతుందని, తేలికగా అరుగుతుందని. జీర్ణశక్తిని పెంచి, పడి శెభారం, ఆయాసం, దగ్గుల్ని తగ్గిస్తుందని భోజన కుతూహలం వివరించింది. అంగార కర్కటీ అంటే ఇదేనని కూడా పేర్కొంది. లిటి లేదా లిట్టి అనేది హిందీ పదం. లిట్ట అంటే రొట్టెముక్క! లిట్టి
అంటే ‘చిన్న లిట్ట’ అనిభావం!
కాల్చిన లిట్టీ పైన మాడు బెరడు వలిచేస్తే లోపల తెల్లగా పువ్వులా ఉంటుంది లిట్టీ. బహుశా ఈ తెల్ల పువ్వులాంటి లిట్టీలనే శ్రీనా థాదులు అంగరపూవియ లేదా అంగారపూలని పిలిచి ఉండవచ్చు! అంగరొల్లెలన్నా ఇవే!మన పూర్వులు కూడా వీటిని తిన్నారు. మనకు అశ్రద్ధ దేనికి? తేలికగా అరిగే భారతీయఆహార పదార్థం ఇది. పోషకాలను సంపూర్ణంగా నింపి తయారుచేసిన అద్భుత వంటకం.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
బేసన్ మేథీ పరాటా
కావలసిన పదార్థాలు: మెంతికూర-ఒకటిన్నర కప్పు, శనగ పిండి-అర కప్పు, గోధుమ పిండి-రెండు కప్పులు, నూనె-రెండు స్పూన్లు, ఇంగువ - చిటికెడు, వాము-అర స్పూను, జీలకర్ర-స్పూను, కారం-స్పూను, ధనియాల పొడి-స్పూను, జీలకర్ర పొడి-స్పూను, మామిడి పొడి-స్పూను, గరం మసాలా పొడి- స్పూను, ఉప్పు, నెయ్యి, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో గోధుమ పిండికి కాస్త ఉప్పు, తగినంత నీటిని చేర్చి చపాతీ ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. పైన స్పూను నూనెని వేసి కలిపితే పిండి మెత్తగా ఉంటుంది. బాణలిలో కాస్త నూనె వేసి జీల కర్ర, వామును చిటపటలాడించి ఇంగువ వేయాలి. శనగ పిండిని కూడా కలపాలి. కాస్త రంగు మారాక, కారం, ధనియాల పొడి గరం మసాలా, మామిడి పొడి, ఉప్పు చేర్చాలి. రెండు నిమిషాల తరవాత తరిగిన మెంతి కూరను వేయాలి. అంతా దగ్గరవుతుంటే స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రొట్టెలా వత్తుకుని మధ్యలో మెంతి కూర పెట్టి మూసేసి పరాటాలా వత్తుకోవాలి. పెనంమీద కాస్త నూనె వేసి అటూ ఇటూ వేయిస్తే బేసిన్ మేథీ పరాటా తయారు.
నల్ల అలసందల పప్పు
కావలసిన పదార్థాలు: నల్ల అలసందలు - కప్పు, ఉల్లి ముక్కలు - కప్పు, వెల్లుల్లి ముక్కలు - స్పూను,జీలకర్ర - స్పూను, గోధుమ పిండి - పావు కప్పు, పసుపు - స్పూను, కారం - రెండు స్పూన్లు, ధనియాల పొడి - రెండు స్పూన్లు, గరం మసాలా - రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు, నూనె, నెయ్యి - తగినంత.
తయారుచేసే విధానం: నల్ల అలసందలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. బాణలిలో కాస్త నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో కాస్త నూనె వేసి జీలకర్రను చిటపటలాడించి తరవాత ఉల్లి, వెల్లుల్లిని వేయించాలి. ఉల్లి రంగు మారాక పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేయాలి. అలసందలనూ చేర్చి కాస్త నీళ్లు పోసి మూతపెట్టాలి. ఎనిమిది విజిల్స్ తరవాత స్టవ్ కట్టేయాలి. ప్రెషర్ తగ్గాక మూత తీసి అంతా కలిపి మొత్తం చిక్కబడే వరకు ఉడికిస్తే నల్ల అలసందల పప్పు సిద్ధం. అవరసరమైతే కాస్త నీళ్లను చేర్చి ఉడికించాలి. ఈ పప్పు అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.
Updated Date - Sep 14 , 2025 | 11:52 AM