‘భైమి’ ... పవిత్రమైన హల్వా
ABN, Publish Date - Oct 19 , 2025 | 12:46 PM
‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
‘‘శ్రేష్ఠం గోధూమచూర్ణం
ప్రచుర ఘృతయుతం నాలికేరేణ సార్ద్ర
ద్రాక్షా ఖర్జూర శుంఠీ త్వచ
మరీచయుతం శర్కరాపూర్ణగర్భాత్
పక్వం తామ్రెకటాహె రలవిటలరవె:
పావకె మందదీప్తో
ధన్యే హేమంతకాలే సుజనపరివృతె
భుజ్యతె విప్రశేషమ్’’
‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి. తియ్య ద్రాక్ష, ఖర్జూరం ముక్కలు, శొంఠి, దాల్చినచెక్క, మిరియాల పొడులు, పంచదార వీటిని తగు పాళ్లలో తీసుకోవాలి. ఒక రాగిపాత్రలో గోధుమపిండిని, తగినంత నెయ్యినీ కలిపి కొబ్బరిపాలు గాని కొబ్బరినీళ్లు గానీ పోసి ఉండకట్టకుండా కలియ దిప్పాలి. పైన చెప్పినవాటిలో మిగిలిన ద్రవ్యాల్ని, పంచదారనీ చేర్చి కుతకుత శబ్దం వచ్చేవరకూ సన్నసెగన ఉడికించాలి.
ఇది ‘భైమీ’ అనే హల్వా! దీనికి భైమి పేరు ఎందుకు వచ్చిందనేది ఒక ప్రశ్న. తీపి హల్వాలో శొంఠి, దాల్చిన చెక్క మిరియాల పొడి అవసరం ఏమిటనేది ఇంకో ప్రశ్న. జాగ్రత్తగా విశ్లేషిస్తే ‘‘ధన్యేహేమంతకాలే సుజన పరివృతె భుజ్యతె విప్రశేషమ్’’ అనే నాలుగో పాదంలో దాని అంతరార్థం దాగి ఉంది.
భైమ ఏకాదశి వైష్ణవులకు చాలా ముఖ్యమైన పర్వదినం. భైమ ఏకాదశినాడు కృష్ణభక్తులందరూ కలిసి పూర్తి ఉపవాసం ఉండి, కృష్ణతత్త్వం ఆకళింపు చేసుకుంటూ ఆత్మశుద్ధిని పొంది, ఆచార్యులతోనూ, పవిత్ర హృదయం కలిగిన వ్యక్తులతోనూ కలిసి ఈ భైమి ప్రసాదాన్ని తిని ఉపవాస దీక్ష విరమిస్తారు. బహుశా భైమి అనే పేరు రావటానికి ఇది కారణం కావచ్చు అనుకుంటాను. మనకన్నా ఉత్తరాదిలో దీని ప్రాధాన్యత ఎక్కువ.
భైమ ఏకాదశి హేమంత రుతువులో ఫిబ్రవరి మాసాంతంలో వస్తుంది. మనకు అప్పటికే వేసవి వచ్చేస్తుంది. కానీ, ఉత్తరాదిలో చలి వణికిస్తూనే ఉంటుంది. ఉపవాస, జాగరణ వ్రతాల వలన ఆ చలికాలంలో వాతవృద్ధి కలగకుండా శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క నెయ్యి వగైరాలను చేర్చటం ఆరోగ్య భద్రతనిచ్చే మంచి ఉపాయం.
వాతపు వ్యాధులున్నవారికి ఇది ఉత్తమ ఔషధం అని వేరే చెప్పనవసరం లేదు. ఎసిడిటీతో బాధపడేవారికి కూడా పేగుల్ని మృదువు పరచి, జాఠరాగ్నిని పెంచి ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. వేసవి కాలంలోనూ ఇది మేలు చేసే వంటకమే! కఫాన్ని తగ్గించేది కాబట్టి, చలికాలంలో వచ్చే సమస్త అనారోగ్యాలకూ ఇది ఔషధమే!
ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం కూడా! బడి నుంచి రాగానే పిల్లలు ఏదైనా చిరుతిళ్లకోసం ఎదురు చూస్తారు. వాళ్లకి ఏవేవో జంక్ ఫుడ్స్ కన్నా ఈ స్వీటుని వండి పెడితే ఆరోగ్యదాయమైన ఆహారం ఇచ్చిన వాళ్లం అవుతాం!
సౌమ్య గుణాలు కలిగిన ఆహారపదార్థాలు తిన్నప్పుడు మనసులో సౌమ్యమైన, సత్వగుణప్రధానమైన ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి పదార్థాలు తినే వ్యక్తులున్న సమాజం ఉన్నతిని కలిగి ఉంటుంది. మన ఆహారం పవిత్రమైనదైతే మన మనసూ పవిత్రంగా ఉంటుందని, మనం అపవిత్ర జంక్ ఆహారాలకు బానిసలమైతే మన మనసూ అలానే అపవిత్రంగా ఉంటుందనీ అర్థం చేసుకోవాలి! ధన్యులకు ధన్యత నిచ్చే వంటకం భైమి!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
దూద్ దూది
కావలసిన పదార్థాలు: సొరకాయ-ఒకటి, జీలకర్ర-స్పూను, పసుపు - స్పూను, కారం - స్పూను, గరం మసాలా - స్పూను, పాలు - అర లీటర్, చక్కెర - అర స్పూను, నూనె - రెండు స్పూన్లు, ఉప్పు- స్పూను, కొత్తిమీర తరుగు - స్పూను.
తయారుచేసే విధానం: సొరకాయ చెక్కు తీసి గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఓ బాణలిలో నూనె వేసి జీలకర్రను చిటపటలాడించాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా కలపాలి. రెండు నిమిషాల తరవాత సొరకాయ ముక్కల్ని వేసి మూతపెట్టాలి. ముక్కలు కాస్త మెత్తబడుతుంటే, సగం పాలు పోయాలి. అంతా దగ్గరవుతుంటే చక్కెర, మిగతా పాలనూ వేసి అంతా ఉడికించి స్టవ్ కట్టేయాలి. పైన కొత్తిమీర చల్లితే సరి. ఇది గుజరాతీ వంటకం.
కొత్తిమీర నిమ్మ సూప్
కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, నిమ్మ రసం - స్పూను, మొక్కజొన్న పిండి - స్పూను, నీళ్లు - మూడు కప్పులు, మిరియాల పొడి - స్పూను, అల్లం, వెల్లుల్లి ముక్కలు - అర స్పూను, ఉల్లికాడలు - ముప్పావు కప్పు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేయించాలి. కాస్త ఘుమఘుమలాడుతుంటే ఉల్లి కాడల్నీ జతచేయాలి. రెండు నిమిషాల తరవాత క్యారెట్, కొత్తిమీర నూ కలిపి వేయించాలి. అర కప్పు నీళ్లలో మొక్కజొన్న పిండిని కలిపి పాన్‌లో వేయాలి. మూడు కప్పుల నీళ్లనూ వేసి బాగా మరగించాలి. కాస్త దగ్గరవుతుంటే ఉప్పు, మిరియాల పొడి కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్ కట్టేసి నిమ్మరసం కలిపితే కొత్తిమీర నిమ్మ సూప్ తయారు.
Updated Date - Oct 19 , 2025 | 12:46 PM