‘ప్రపంచ శాంతి’లో మహిళల పాత్ర పెరగాలి
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:35 AM
స్వీడన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆన్‌లిండే మాట్లాడుతూ ప్రపంచశాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెంచాలని సూచించారు. ఐరాస నిర్వహించే ప్రపంచ శాంతి చర్చల్లో మహిళల పాత్ర ఉండడం లేదన్నారు.
భారత్ సమ్మిట్‌లో ‘జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్’
అంశంపై చర్చాగోష్ఠిలో అభిప్రాయపడిన వక్తలు
ప్రభుత్వాల్లో మహిళలుంటేనే అవినీతికి కళ్లెం
ఆయా దేశాల బడ్జెట్లలోనూ ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రైవేటు రంగంలోనూ ప్రోత్సాహకాలు ఉండాలి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ శాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ‘జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్’ అంశంపై జరిగిన చర్చా గోష్ఠి (ప్యానెల్ డిస్కషన్)లో పలువురు విదేశీ ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, పల్లం రాజు, నారాయణ్‌పేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడారు. స్వీడన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆన్‌లిండే మాట్లాడుతూ ప్రపంచశాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెంచాలని సూచించారు. ఐరాస నిర్వహించే ప్రపంచ శాంతి చర్చల్లో మహిళల పాత్ర ఉండడం లేదన్నారు. మహిళలు పాల్గొనడం వల్ల ప్రపంచ శాంతి పరిఢవిల్లే అవకాశం ఉంటుందన్నారు. మంగోలియా ఎంపీ, ఆర్థికవేత్త ఉండ్రామ్ చిన్‌బాట్ మాట్లాడుతూ మహిళలు, పురుషుల సంఖ్య ఆధారంగా దేశాల బడ్జెట్‌ను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తమ పార్లమెంటులో 25శాతం మంది మహిళా ఎంపీలేనని తెలిపారు. గృహ హింస, లైంగిక వేధింపుల విషయంలో కఠిన చట్టాలను అమలు చేస్తున్నామని వివరించారు.
సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ ఒకప్పుడు టీచర్ వృత్తికే పరిమితమైన మహిళలు ఇప్పుడు భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్లుగా రాణిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ మహిళలకు ప్రోత్సాహకాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పల్లంరాజు మాట్లాడుతూ రాజీవ్ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామికీకరణకు దారి తీసిందన్నారు. నారాయణ్‌పేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతను సాధించాలంటే సమాజ ఆమోదం ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నంలో ఉందని, తన నియోజకవర్గంలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేయించానని తెలిపారు. జెండర్ జస్టి్‌సను సాధించాలంటే సమ్మిళిత విధానాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. అర్జెంటీనా సోషలిస్ట్ పార్టీ నాయకురాలు మోనికా హైదీ ఫీన్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి తమ దేశంలో కఠిన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 04:35 AM