Uttam: పాలమూరు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపండి
ABN, Publish Date - May 08 , 2025 | 04:30 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సమ్మక్క-సారక్క బ్యారేజీ ప్రాజెక్టులకు వేగంగా నీటి కేటాయింపులు జరపాలంటూ సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్‌ను నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కోరారు.
కృష్ణా నది వెంట టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయండి
సీడబ్ల్యూసీ చైర్మన్‌కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సమ్మక్క-సారక్క బ్యారేజీ ప్రాజెక్టులకు వేగంగా నీటి కేటాయింపులు జరపాలంటూ సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్‌ను నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కోరారు. అంతరాష్ట్ర నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల భద్రత, పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం, తెలంగాణకు నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ బుధవారం ఢిల్లీలో అతుల్ జైన్‌తో భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపులు జరపాలని, మొదటి దశలో 45 టీఎంసీలు వెంటనే మంజూరు చేయాలని ఉత్తమ్ కోరారు. సమ్మక్క-సారక్క బ్యారేజీని దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (దశలు 1, 2) కింద దాదాపు 5.55 లక్షల హెక్టార్లకు సాగు నీరందించేలా రూపొందించామని.. ఆ ప్రాజెక్టుకు 44 టీఎంసీలను కేటాయించాలన్నారు. కృష్ణా నది జలాలను ఏపీ అక్రమంగా మళ్లిస్తోందని.. నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి నది వెంట టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్ తదితరాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు విషయమై తమతో కలిసి పనిచేయాలని.. పునరుద్ధరణ, పరిరక్షణకు దిద్దుబాటు చర్యలపై సలహాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
‘కృష్ణా నోటిఫికేషన్’పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జూలై 28కి వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. దానిపై స్టే విధించాలని కోర్టును కోరింది. అయితే గత మూడేళ్లుగా ఉన్న నోటిఫికేషన్లను ఎందుకు నిలిపివేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఈ నోటిఫికేషన్లను అమలు చేయలేదని తెలంగాణ పేర్కొం ది. 2014లో ఏపీ, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని, కానీ.. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరగలేదని తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ కోర్టుకు చెప్పారు.
Updated Date - May 08 , 2025 | 04:30 AM