ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sitarama Lift Irrigation: యుద్ధప్రాతిపదికన ‘సీతారామ’ పూర్తి చేస్తాం

ABN, Publish Date - May 11 , 2025 | 05:14 AM

సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

  • ఖమ్మం జిల్లాలో 7.8 లక్షల ఎకరాలకు నీరు: ఉత్తమ్‌

  • భట్టి, తుమ్మల, పొంగులేటితో కలిసి ప్రాజెక్టుపై సమీక్ష

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.8లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకా 67టీఎంసీలు కేటాయించుకుని, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం పొందామని తెలిపారు. శనివారం జలసౌధలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలసి ఉత్తమ్‌ సమీక్ష చేశారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరయ్యారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) కేసులతో సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణం ఆగిందని, త్వరలోనే పనులు చేపడతామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు సాధించామన్నారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.


సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్‌ పనులు 97 శాతం మేర పూర్తయ్యాయని, మూడు పంప్‌హౌ్‌సల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయిందని వారు తెలిపారు. నాలుగో పంప్‌హౌస్‌ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పాలేరు లింక్‌ కెనాల్‌, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌, ఎన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, భూసేకరణ, అటవీ అనుమతులు, టన్నెల్‌ పనుల వద్ద ఇబ్బందులు ఉన్నాయన్నారు. సత్వరమే ప్రతిబంధకాలను తొలగించి, పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్‌ను మంత్రి ఆదేశించారు. సీతమ్మసాగర్‌ బ్యారేజీలో భాగంగా 282.8 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణం చేపట్టనున్నామని, దీనికి సంబంఽధించిన డిజైన్లు/డ్రాయింగ్‌లు అందించాలని తెలంగాణ జెన్‌కోను కోరామని, ఒక కన్సల్టెంట్‌ నియామకం జరగాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.


మున్నేరు-పాలేరు లింక్‌ కెనాల్‌ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకున్నా దుమ్ముగూడెం ఆనికట్‌ ద్వారా నీటిని పంపింగ్‌ చేసి, కొత్తగా ఓటీలు కట్టుకొని చెరువులు నింపడానికి అవకాశం ఉందని అధికారులు తెలపగా... సత్వరం పనులు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పనుల్లో వేగం పెంచాలని మంత్రి తుమ్మల కోరగా మున్నేరు-పాలేరు లింక్‌ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి అధికారులను కోరారు. మారిన ప్రాజెక్టు అలైన్‌మెంట్‌తో ఇల్లెందు నియోజకవర్గానికి నీరు అందే అవకాశాలు లేకుండా పోయాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నర్సయ్య అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఏలుతున్నారని మంత్రి ఉత్తమ్‌ సరాదాగా వ్యాఖ్యానించారు. సమీక్ష అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన సరాదాగా పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - May 11 , 2025 | 05:14 AM