అకాల వర్షం.. తడిసిన ధాన్యం!
ABN, Publish Date - May 15 , 2025 | 05:05 AM
నడి వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు.. బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో వానలు కురిశాయి.
పలు జిల్లాల్లో వానలతో రైతుల ఇక్కట్లు
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. ప్రతి గింజా కొంటామని భరోసా
పిడుగుపాటుకు ఒకరు.. వడదెబ్బతో మరొకరి మృత్యువాత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): నడి వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు.. బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో సుమారు 50 మంది రైతుల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క గోగుపల్లికి చెరుకుని తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో 1,500 క్వింటాళ్ల వరకు వరి ధాన్యం తడవడంతో పాటు కొంత కొట్టుకుపోయింది. ఓదెల మండలం మడకలో ఈదురుగాలులకు విద్యుత్తు వైర్లు తెగిపడి 25 గొర్రెలు మృతి చెందాయి. సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు కోనరావుపేటలో ఎద్దు మృతి చెందగా, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట, బెజ్జూరు మండలాల్లోనూ వర్షం కురిసింది.
రంగారెడ్డి జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లలోనూ ధాన్యం కొట్టుకుపోయింది. షాబాద్ మండలం చందనవెల్లిలో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమనగల్లు, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి, నవాబ్‌పేట మండలాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద పారింది. వేసవిలోనూ వానలు క్రమంగా పడుతుండటంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందారు. ఇక సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లిలో పొలం పనికి వెళ్లిన ఎడ్ల రత్నమ్మ (50) పిడుగపాటుకు మరణించగా.. మరో కూలీ నాగమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వడదెబ్బతో ఓ ఉపాధి కూలీ మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా పాత పోచారంలో గజ్జి యాకమ్మ ఉపాధి పనులు చేస్తూ కుప్పకూలి పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించింది.
Updated Date - May 15 , 2025 | 05:05 AM