పసి ప్రాణానికి ఆయువు పోసిన ‘ప్రజావాణి’
ABN, Publish Date - Mar 12 , 2025 | 05:20 AM
రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఓ పసి ప్రాణాన్ని కాపాడింది. ఓ పేద కుటుంబంలో వెలుగులు నింపింది. నెలల నిండక ముందే పుట్టడమే కాక తీవ్ర అనారోగ్యంతో జన్మించిన ఓ చిన్నారికి కావాల్సిన వైద్య సాయం అందించి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది.
నెలలు నిండక మునుపే పుట్టిన చిన్నారికి తీవ్ర అనారోగ్యం
సాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించిన తల్లిదండ్రులు
ఆరోగ్య శ్రీ ద్వారా 22.50 లక్షలతో ప్రైవేటు ఆస్ప్రతిలో చికిత్స
బేగంపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఓ పసి ప్రాణాన్ని కాపాడింది. ఓ పేద కుటుంబంలో వెలుగులు నింపింది. నెలల నిండక ముందే పుట్టడమే కాక తీవ్ర అనారోగ్యంతో జన్మించిన ఓ చిన్నారికి కావాల్సిన వైద్య సాయం అందించి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన రామచందర్, సుస్మిత దంపతులకు కుమార్తె జన్మించింది. ఏడో నెలలోనే సుస్మిత ఆ పాపను ప్రసవించింది. దానికి తోడు ఆ చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యలతో పుట్టింది. దీంతో తల్లిదండ్రులు ఆ పసికందును ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా.. పాపను రెండు నెలలు పాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాలని, రోజుకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని సిబ్బంది తెలిపారు. దీంతో సుస్మిత దంపతులు..
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యను కలిసి తమ సమస్యను వివరించి సాయం కోరారు. అధికారుల సూచన మేరకు ప్రజావాణి రాజీవ్ ఆరోగ్యశ్రీ బృందం నాయకుడు సంతోష్ ఏర్పాట్లు చేయగా.. సుస్మిత దంపతులు తమ బిడ్డను విద్యానగర్‌లోని ‘నియో బీబీసీ చిల్డ్రన్స్ ఆస్పత్రి’లో చేర్చి చికిత్స చేయించారు. 45 రోజుల చికిత్స అనంతరం పాప పూర్తిగా కోలుకోగా వైద్యులు డిశ్చార్జి చేశారు. రోజుకు రూ.50వేల చొప్పున 45 రోజుల పాటు చికిత్సకు అయిన రూ.22.50 లక్షల ఖర్చును ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మంజూరు చేసింది. సోమవారం పాప డిశ్చార్జి అవ్వగా తల్లిదండ్రులు.. తమ బిడ్డ ప్రాణాలు నిలబడేందుకు సాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యకు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Mar 12 , 2025 | 05:20 AM