Duddilla Sridhar Babu: 7,183 ఎకరాల సంగతి తేల్చండి!
ABN, Publish Date - Jun 26 , 2025 | 03:52 AM
హైదరాబాద్ నగరంలో గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 7183.13 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కుమారస్వామిని కోరారు.
కేంద్ర సంస్థల వద్ద నిరుపయోగంగా భూములు
అవి రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయి
కేంద్ర మంత్రులకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 7183.13 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కుమారస్వామిని కోరారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని తెలిపారు. కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయన్నారు. ఆ సంస్థల పరిధిలోని భూములు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని, కొన్ని సంస్థలు వాటిని వాణిజ్య పరంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఆ భూములు ఉపయోగంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరిలోని హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ పరిధిలో 323.87 ఎకరాలు, ఐడీపీఎల్ పరిధిలో 551.03 ఎకరాలు, హెచ్‌ఎంటీ పరిధిలో 888.05 ఎకరాలు, సంగారెడ్డిలోని హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ పరిధిలో 126.33 ఎకరాలు, ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో 2,272.85 ఎకరాలు, సంగారెడ్డి ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలో 3,020 ఎకరాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం ఆయా భూములు ఎంతో విలువైనవని.. అవి రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ విషయమై త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని శ్రీధర్ బాబుకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
చైనా ఆంక్షలతో ఉత్పత్తి రంగంపై ప్రభావం
అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్టవ్‌ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. చైనా తీసుకున్న నిర్ణయం తెలంగాణ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్- నాగ్‌పూర్, హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.400కోట్లను పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని కోరారు. వరంగల్ ఫ్యూచర్ సిటీ, మామునూరు విమానాశ్రయ అభివృద్ధి సహా పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలన్నారు. కేంద్రం ప్రతిపాదించిన 100పారిశ్రామిక పార్కుల పథకానికి నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ సెంటర్ (ఎన్‌డీసీ) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రోపై ఎందుకీ వివక్ష?
కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో 2పై ప్రకటన వస్తుందని ఆశించామన్నారు. కానీ, కేంద్రం మరోసారి నిరాశ పరిచిందని తెలిపారు. పుణె మెట్రోకు అనుమతి ఇచ్చి హైదరాబాద్ మెట్రోపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు సహకరించరని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
For National News And Telugu News
Updated Date - Jun 26 , 2025 | 03:52 AM