‘తెలుగు స్థానంలో సంస్కృతం’పై ఇంటర్ బోర్డు యూటర్న్!
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:39 AM
ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన ఇంటర్ బోర్డు.. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలపై ఎట్టకేలకు స్పందించింది.
సాహితీవేత్తల విమర్శలతో వెనక్కు
తెలుగు పట్ల అపార గౌరవం..అభిమానం
10 సంస్కృత అధ్యాపక పోస్టుల భర్తీ కోసమే వివరాలడిగాం
సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు: ఆర్జేడీ జయప్రదబాయి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన ఇంటర్ బోర్డు.. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలపై ఎట్టకేలకు స్పందించింది. తెలుగు భాషావేత్తలు, సాహితీవేత్తల విమర్శలతో యూటర్న్ తీసుకుంది. తెలుగు పట్ల అపార గౌరవం, అభిమానం ఉన్నాయని, రాష్ట్ర అధికార భాష అయిన తెలుగును నిలబెట్టేందుకు తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని ప్రకటించింది. అయితే వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) హోదాలో జయప్రదబాయి నిబంధనలకు వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా జారీ చేసిన ఉత్తరుల విషయాన్ని ప్రస్తావించిన ‘ఆంధ్రజ్యోతి’ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య వివరణ ఇచ్చారు. ‘తెలుగుకు ద్రోహం.. ‘జయప్రదం’గా సంస్కృతం’’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా, ఈ కథనంలోని ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం ఇవ్వకుండా.. తప్పుడు సమాచారంతో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు, అందుకు అవసరమయ్యే సంస్కృత జూనియర్ లెక్చరర్ల పోస్టుల కోసం పూర్తి వివరాలతో కూడి నివేది అందించాలని ఇంటర్ బోర్డులో వరంగల్ ఆర్జేడీగా ఉన్న జయప్రదబాయి ఈ నెల 8న అన్ని ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గతంలోని రెండు మెమోలను రిఫరెన్స్‌గా ఆమె ప్రస్తావించారు. అయితే ఆ రెండు రిఫరెన్స్‌లలో ఎక్కడ కూడా సంస్కృతాన్ని అన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టాలన్న పదమే లేదు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన జయప్రదబాయి.. ‘ఆంధ్రజ్యోతి’ కథనం తప్పు అంటూ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పేర్కొన్న విషయం ప్రభుత్వాన్ని కూడా తప్పుబట్టేలా ఉంది.
అవాస్తవాలతో ప్రకటన..
‘‘ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన 10 సంస్కృత పోస్టుల భర్తీ కోసమే కాలేజీల నుంచి అంతర్గతంగా సమాచారం కోరాం’’ అని ప్రకనటలో ఆర్జేడీ జయప్రదబాయి తెలిపారు. కానీ, ఇది అవాస్తవం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 సంస్కృత పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 14న కౌన్సెలింగ్ నిర్వహించి పది మందిని ఎంపిక చేసింది. మార్చి 12న సీఎం వీరికి నియామక పత్రాలు జారీ చేశారు. వీరంతా మార్చి 13న ఉద్యోగ బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ, అన్ని కాలేజీల్లో సంస్కృతం అమలు సమాచారం కోరుతూ ఆర్జేడీ ఈ నెల (ఏప్రిల్) 8న ఆదేశాలు జారీ చేశారు. అంటే 10 మంది సంస్కృత ఉపాధ్యాయులు వారికి కేటాయించిన కాలేజీల్లో చేరిన 25 రోజుల తరువాత ఉత్తర్వులిచ్చారు. ఇది పూర్తిగా ఇంటర్ బోర్డుతోపాటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. గత ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో వరంగల్ ఆర్జేడీగా ఉన్న జయప్రద బాయిని ఇంటర్ బోర్డులో అత్యంత కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించి నియమించారు. రెండు కీలక పదవుల్లో ఉంటూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా ఉత్తర్వులు, తప్పుడు ప్రకటనలు జారీ చేస్తున్నా.. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News
Updated Date - Apr 26 , 2025 | 04:39 AM