Assembly: వర్గీకరణకు చట్టం చేద్దాం
ABN, Publish Date - Feb 14 , 2025 | 03:51 AM
రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాలోనే బిల్లును ప్రవేశపెట్టి, సభలో చర్చించి ఆమోదించి, చట్టరూపం కల్పిస్తారు.
జీవో కంటే చట్టమే మేలు.. అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు.. రాష్ట్ర ప్రభుత్వం యోచన
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంరఽధజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాలోనే బిల్లును ప్రవేశపెట్టి, సభలో చర్చించి ఆమోదించి, చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం, వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నట్టు తెలిసింది. చట్టబద్ధత కల్పించినపుడే ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా అయితేనే విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కేటాయించిన రోస్టర్ పాయింట్ల వారీగా అమలుకు సమస్య ఉండదని అంచనా వేస్తోంది. వర్గీకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉన్నాయని, మార్పులు అవసరమని ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే వాటి పైనా శాసనసభ, మండలిలో చర్చించి చట్టంలో సవరణలు చేసేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
శాసనసభలో తీర్మానం మాత్రమే చేసి, జీవో ఇస్తే ఆశించిన స్థాయిలో ప్రభావం ఉండక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం కావడంతో చట్టబద్ధతకు మొగ్గు చూపారు. ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పించిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయాలన్నా మళ్లీ ఉభయ సభల్లో బిల్లు పెట్టి చర్చించి సవరించాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రాథమికంగా వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాతినిథ్యంలో వెనుకబాటుతనం ఆధారంగా ప్రాధాన్యం కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చెప్పిన జాగ్రత్తలు తీసుకొంటూ వర్గీకరణ చేపట్టే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, గ్రూపుల వారీగా 15 శాతం రిజర్వేషన్‌ను విభజించింది. గ్రూపు-1లో సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన, పట్టించుకోని కులాలను చేర్చారు. 1 శాతం ఇచ్చారు. గ్రూపు-2లో ఒక మోస్తరుగా లబ్ధిపొందిన కులాలను చేర్చి 9 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. గ్రూపు-3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వీరికి 5 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. కమిషన్ గడువు ఫిబ్రవరి 10తో ముగియడంతో జస్టిస్ షమీమ్ అక్తర్ బృందం తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. 2024 అక్టోబరు 11న ఏకసభ్య కమిషన్‌ను వేయగా, జిల్లాలలో పర్యటించి, సమాచారం సేకరించి 82 రోజుల్లోగా కమిషన్ 199 పేజీల నివేదికను రూపొందించింది.
చంద్రబాబు హయాంలో
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎస్సీ వర్గీకరణపై తొలుత మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.రామచంద్రరాజు నేతృత్వంలో కమిషన్ వేశారు. కమిషన్ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణంగా 1997లో జీవో ఇచ్చి వర్గీకరణను అమలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేయడంతో 1999లో ఆర్డినెన్స్ తెచ్చి తిరిగి అమలు చేశారు. 2000 సంవత్సరంలో దానికి చట్టరూపం ఇచ్చారు.
Updated Date - Feb 14 , 2025 | 03:51 AM