తెలుగు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లుంది!
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:47 AM
ద్వితీయ భాషల విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మాతృభాషను హతమార్చేలా ఉన్నాయని రాష్ట్రంలోని తెలుగు ఆచార్యులు, పరిశోధకులు, సాహితీవేత్తలు ప్రభుత్వానికి లేఖ రాశారు.
మాతృభాషను చంపేస్తున్న ఇంటర్ బోర్డు
ద్వితీయ భాషగా సంస్కృతం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వానికి తెలుగు ఆచార్యులు, సాహితీవేత్తల లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ద్వితీయ భాషల విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మాతృభాషను హతమార్చేలా ఉన్నాయని రాష్ట్రంలోని తెలుగు ఆచార్యులు, పరిశోధకులు, సాహితీవేత్తలు ప్రభుత్వానికి లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాష స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయం అధికారులు స్వతంత్రంగానే తీసుకున్నారా? లేక ప్రభుత్వ విధానమా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకునేముందు సమగ్ర అధ్యయనం, సంబంధిత నిపుణులతో సంప్రదింపులు, చర్చలు జరపాలని పేర్కొన్నారు. కానీ, నిపుణులతో కమిటీలు వేయకుండా, ఎలాంటి అధ్యయనం చేయకుండా ఇంటర్ బోర్డు ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు సాగి కమలాకర శర్మ, సి.కాశీం, ఏలె విజయలక్ష్మి, ఎస్.రఘుతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులు ప్రశ్నించారు.
ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాలు చూస్తుంటే తెలంగాణలో తెలుగు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. పదో తరగతి తర్వాత విద్యా జీవితానికి అత్యంత కీలకమైన ఇంటర్‌లో మాతృభాష అత్యంత కీలకమన్నారు. అది లేకుండా కేవలం మార్కుల కోసం సంస్కృతాన్ని ప్రవేశపెడితే విద్యార్థులు మాతృభాషకు పూర్తిగా దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి వరకు ప్రస్తావనే లేని సంస్కృతాన్ని ఇంటర్లో అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం ప్రభుత్వం చేసిన తప్పని అభిప్రాయపడ్డారు. విద్యార్థి జీవితానికి ఏ మాత్రం ఉపయోగపడని సంస్కృతాన్ని ప్రోత్సహించడం వెనక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. ఇంటర్లో ద్వితీయ భాష విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, బోర్డు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇంటర్‌లో ద్వితీయ భాషగా తెలుగును మరింత సమర్థంగా అమలు చేసేందుకు, విద్యార్థులు తెలుగునే తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలుగు ఆచార్యులు, విద్యావేత్తలతో ఉన్నతస్థాయి కమిటీని వేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Apr 25 , 2025 | 03:47 AM