ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: బనకచర్లకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దు

ABN, Publish Date - Jun 17 , 2025 | 04:41 AM

పోలవరం-బనకచర్ల అనుసంధానం కోసం చేపట్టిన ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ అనుమతి ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని తెలంగాణ కోరింది.

  • పోలవరం విస్తరణ గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధం

  • కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధానం కోసం చేపట్టిన ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ అనుమతి ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు సోమవారం లేఖ రాశారు. మంగళవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతికి అవసరమైన విధి విధానాల(టీవోఆర్‌)పై చర్చించేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అజెండాలో పోలవరం-బనకచర్ల (గోదావరి-బనకచర్ల అనుసంధానం) ప్రాజెక్టు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. 200 టీఎంసీల సామర్థ్యంతో ఏపీ చేపట్టదలిచిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్‌-1980 తీర్పునకు విరుద్ధమని, ఈ ప్రాజెక్టు చేపట్టే అధికారం ఏపీకి లేదని ఉత్తమ్‌ తన లేఖలో పేర్కొన్నారు.

గోదావరి నదిపై తెలంగాణ హక్కులను కాలరాసేలా ఉన్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించడానికి కూడా వీల్లేదని గతంలో తాము లేఖలు రాయగా.. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఉత్తమ్‌ తెలిపారు. వరద నీటి పేరుతో గోదావరి జలాలను అక్రమంగా తరలించడానికి నిర్ణయం తీసుకున్నారని, వరద జలాలపై ఏపీకి హక్కులు లేవని పేర్కొన్నారు. గోదావరిలోనే కాకుండా కృష్ణాలోనూ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ఏపీ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. ‘పోలవరంతో ముడిపడిన పర్యావరణ అంశాలను ప్రభావిత రాష్ట్రాలతో సమావేశమై పరిష్కరించాలని 2022 సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నాలుగుసార్లు సమావేశాలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా పోలవరం విస్తరణకు అనుమతిపై నిపుణుల మదింపు కమిటీ సమావేశం జరగడం అభ్యంతరకరమ’ని స్పష్టం చేశారు. కాగా, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కూడా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి మరో లేఖ రాశారు.

అజ్ఞానంతోనే హరీశ్‌ వ్యాఖ్యలు: ఉత్తమ్‌

గోదావరి-బనకచర్ల అనుసంధానంపై హరీశ్‌రావు వ్యాఖ్యలు, లేఖలు ఆయన అజ్ఞానానికి తార్కాణమని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 15న హరీశ్‌ తనకు రాసిన లేఖపై మంత్రి స్పందించారు. నదీ జలాలపై తెలంగాణ న్యాయమైన హక్కును, ప్రయోజనాలను దెబ్బతీసేలా హరీశ్‌ వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు.

Updated Date - Jun 17 , 2025 | 04:41 AM