సౌర గిరి జలవికాసం నల్లమలలో ఆరంభం
ABN, Publish Date - May 19 , 2025 | 04:40 AM
రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్‌వోఎ్‌ఫఆర్) పట్టా భూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిర సౌర గిరి జలవికాసం పథకం సోమవారం ప్రారంభం కానుంది.
నేడు మాచారంలో సోలార్ పంపుసెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
అనంతరం సభ.. ఆపై స్వగ్రామానికి..
కొండారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్‌కు
హైదరాబాద్/నాగర్‌కర్నూల్, మే 18 (ఆంధ్రజ్యోతి): రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్‌వోఎ్‌ఫఆర్) పట్టా భూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిర సౌర గిరి జలవికాసం పథకం సోమవారం ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి.. లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడి సీతారామాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో బోర్లు వేసి, పండ్ల తోటలను పెంచి, అందులో అంతర పంటలను సాగు చేసి స్థానికులకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు వాటిపై యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకువచ్చింది. ఈ చట్టం కింద తెలంగాణలో 2.30 లక్షల మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాల అటవీ సాగుభూమిపై అప్పటి ప్రభుత్వం యాజమాన్య హక్కులను కల్పిస్తూ పట్టాలు ఇచ్చింది. అయితే ఆర్‌వోఎ్‌ఫఆర్ చట్టంలోని మార్గదర్శకాలను అనుసరించి ఆ భూముల అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వమూ ఆ భూముల అభివృద్ధిపై దృష్టి సారించలేదు.
ఆర్‌వోఎఫ్ఆర్ భూముల అభివృద్ధి కోసం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్‌వోఎ్‌ఫర్ పట్టా భూముల సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరి జలవికాసం పేరుతో పథకాన్ని రూపొందించింది. తద్వారా ఆర్‌వోఎ్‌ఫఆర్ పట్టా లున్న 2.10లక్షల మంది గిరిజన రైతుల భూములతోపాటు ఈ చట్టంతో సంబంధం లేకుండా అటవీప్రాంతాల్లో భూమి ఉన్న ఇతర గిరిజన రైతుల భూములనూ ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. 2025-26 నుంచి 2029-30 వరకు ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.12,600 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. యూనిట్ ధర రూ.6 లక్షలు కాగా, వంద శాతం సబ్సిడీతో పథకం మంజూరు కానుంది. ఈ రూ.6 లక్షలతో భూమి అభివృద్ధి, ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్ నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్‌తో ఉద్యాన తోటల పెంపకం చేపట్టనున్నారు. ఈ ఏడాది రూ.600 కోట్లతో 10 వేల మంది గిరిజన రైతులకు చెందిన 27,184 ఎకరాల భూములను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకంతో మాచారంలో 49 ఎకరాల ఆర్‌వోఎ్‌ఫఆర్ భూములు అభివృద్ధి చెందనున్నాయి.
కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్
మాచారంలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉన్న తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. ఆ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు రండి
చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు దత్తన్న ఆహ్వానం
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): జూన్ మొదటి వారం లో హైదరాబాద్‌లో జరిగే తన ఆత్మకథ తెలుగు పుస్తక ఆవిష్కరణకు రావాలంటూ తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో కలిసిన దత్తాత్రేయ.. ఈమేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దత్తాత్రేయ ఆత్మకథ హిందీ వెర్షన్ ‘‘జనతాకీ కహానీ.. మేరీ ఆత్మకథ’’ పేరుతో ఇటీవల ఢిల్లీలో విడుదలైన సంగతి తెలిసిందే. దాన్ని ‘‘ప్రజల కథే.. నా ఆత్మకథ’’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నట్లు ఏపీ, తెలంగాణ సీఎంలకు దత్తాత్రేయ తెలిపారు. ఆయనతో పాటు అలయ్‌బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి, జిగ్నే్‌షరెడ్డి ఉన్నారు.
Updated Date - May 19 , 2025 | 04:40 AM