International Events: మన పండగలు అంతర్జాతీయ స్థాయిలో!
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:14 AM
తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. భారతదేశ పర్యాటకానికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలని భావిస్తోంది.
ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా కార్యాచరణ
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, ఆదాయంపై సర్కారు దృష్టి
మేడారం, నాగోబా జాతరలు, బతుకమ్మ, బోనాలు,
కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం
బతుకమ్మ పండగతోనే ప్రారంభించాలని యోచన!
తొలి దశలో 10 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి!
ఫ్యూచర్‌సిటీలో ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో హోటళ్లు?
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధి
రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. భారతదేశ పర్యాటకానికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ‘తెలంగాణ పర్యాటక విధానం 2025-2030’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో జరిగే పలు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు, కార్నివాల్స్ లాంటి వాటిని రాష్ట్రంలోనూ నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బ్రెజిల్‌లో ఏటా ఘనంగా నిర్వహించే ‘రియో కార్నివాల్’ తరహా కార్యక్రమాలను తెలంగాణలోనూ చేపట్టాలని పర్యాటక శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్వహించే పండగలు, జాతరల చరిత్రను అంతర్జాతీయ పర్యాటకులకూ తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వారిని ఆకర్షించాలని యోచిస్తోంది. తెలంగాణకే ప్రత్యేకంగా నిలిచే పండగలు, జాతరలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ప్రకృతి, ఆధ్యాత్మికం, వైద్యం సహా పలు అంశాలతో కూడిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేసి, వాటిని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఆ ఆరు పండగలు..
రాష్ట్రంలో ఏటా గాలిపటాల పండగ (కైట్ ఫెస్టివల్), కేస్లాపూర్ నాగోబా, మేడారం సమ్మక్క-సారక్క జాతరలు, బతుకమ్మ, బోనాల పండగలతో పాటు నాగార్జునసాగర్ దగ్గరున్న బుద్ధవనంలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ 6 వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని పర్యాటక శాఖ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో రాబోయే బతుకమ్మ పండగతోనే ఈ ప్రణాళిక అమలును ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వాటర్ కార్నివాల్స్, రివర్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహించే అంశంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 పర్యాటక ప్రాంతాల్లో తొలి దశలో 10 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని, పర్యాటకులకు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించనున్నారు. వీటన్నింటిపై పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ప్యూచర్‌సిటీలో హోటల్ ఏర్పాటు..
ఫ్యూచర్ సిటీలో ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద హోటళ్లను ఏర్పాటుచేయించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఒకటి, రెండు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అనంతగిరి కొండల దగ్గర పెద్ద హోటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోటల్ కోసం పలు సంస్థలతో కీలక చర్చలు జరుగుతున్నాయని, అవి త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. హోటళ్ల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ప్రత్యేక రాయితీలను కూడా ఇవ్వనున్నారు. కంపెనీలు పెట్టే పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆయా సంస్థలతో పీపీపీ విధానంలో ఒప్పందాలు చేసుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 1-2 గంటల ప్రయాణ దూరంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లతో పాటు పలు నిర్మాణాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
తొలి దశలో వీటిపైనే దృష్టి..
రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 10 ప్రత్యేక పర్యాటక (స్పెషల్ టూరిస్ట్ ఏరియా-ఎస్టీయే) ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. వికారాబాద్‌లోని అనంతగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక థీమ్‌తో; సోమశిల-నల్లమల, జోగులాంబ, కృష్ణానది ప్రాంతాలు, రామప్ప- మేడారం- బొగత సర్క్యూట్, భద్రాద్రి రామాలయం, వరంగల్ సర్క్యూట్, చార్మినార్, ట్రైబల్ ప్రాంతాలు సహా మరో రెండు మూడు ఉన్నాయి. ప్రత్యేకంగా బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఇదొక్కటే దాదాపు 1500 కి.మీ. మేర ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి మొదలై.. మళ్లీ హైదరాబాద్‌కే వచ్చేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులోనే ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల వివరాలను పొందుపర్చారు. బుద్ధిస్ట్ సర్క్యూట్‌లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపంతో పాటు కీసర, కొండాపూర్, బదన్‌కుర్తి, పాశిగావ్, కోటిలింగాల, ధూళికట్ట, కారుకొండ, అశ్వారావుపేట, నాగార్జునకొండ, ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి ప్రాంతాలు ఉన్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలతో మార్కెటింగ్..
తెలంగాణ పర్యాటకాన్ని దేశమంతటా మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం కోసం ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రముఖుల సహకారం తీసుకోవడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక వేదికలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర పర్యాటక వివరాలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ప్రత్యేకంగా ‘తెలంగాణ టూరిజం’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 28 , 2025 | 03:14 AM