Hanumakonda: పదో తరగతి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:07 AM
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్, మరో నలుగురిపై కేసు నమోదు
పరకాల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి గురుకుల సిబ్బందే కారణమని బాలిక తండ్రి ఈశ్వర్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, హౌస్ మాస్టర్ మీరాబాయితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవాణి సోమవారం ఉదయం బాత్‌రూమ్‌లోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకున్నట్లుగా బంధువులు తెలిపారు. పాప కళ్లు తిరిగి పడిపోతే పరకాలలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తీసుకొచ్చామని గురుకుల పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన వెళ్లిన తల్లిదండ్రులకు బాలిక శవమై కనిపించింది. కుటుంబ సభ్యులతో కలిసి గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏసీపీ సతీ్‌షబాబు, సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
ఇద్దరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కల్తీ ఆహారం తిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి సాంబార్‌తో భోజనం చేయగా తొమ్మిదోతరగతి విద్యార్థులు మణిచంద్, హర్షవర్ధన్‌కు కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. సోమవారం కూడా తగ్గకపోవడంతో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారమందించారు. తల్లిదండ్రులు వచ్చాక పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాక కోలుకున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 05:07 AM