CM Revanth Reddy: భారీ ఐటీ పార్కు
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:21 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది.
రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మాణానికి అంగీకారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో సింగపూర్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ ప్రకటన
ఈ సంస్థకు హైదరాబాద్‌లో ఇప్పటికే 3 యూనిట్లు
ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన
రాష్ట్రానికి రూ.3,950 కోట్ల పెట్టుబడులు
నేడు స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు రేవంత్ బృందం
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరు
దావో్‌సలో పెట్టుబడులపై భారత్ భారీ ఆశలు
సదస్సుకు ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు సీఎంలు, 100కు పైగా సీఈవోలు
సింగపూర్ బోటులో.. మూసీ తలపులో..
సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం అక్కడి నదిలో బోటులో ప్రయాణించారు. హైదరాబాద్‌లో మూసీ నది సుందరీకరణ ప్రయత్నాల్లో ఉన్న సీఎం.. సింగపూర్ సిటీ స్టేట్ రివర్ పునరుజ్జీవానికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నదిలో పడవలో ప్రయాణిస్తూ.. అక్కడి అధికారులు అవలంబించిన విధానాలను తెలుసుకున్నారు. కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో చారిత్రక కట్టడాలను సంరక్షిస్తూ, నీటి నిర్వహణలో గొప్ప పురోగతి సాధించడం చరిత్రాత్మకమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ వీడియోను సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో ఉండనున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ.. హైదరాబాద్‌లో తమ పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించింది.
సింగపూర్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ.. ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. కాగా, క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించడంతోపాటు ఈ కంపెనీ చేపట్టే కొత్త ఐటీ పార్కు నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కంపెనీ ప్రతినిధి గౌరీశంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్‌పార్కు (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తికానుందని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సింగపూర్ పర్యటనలో భాగంగా మూడోరోజు సీఎం రేవంత్‌రెడ్డి బృందం.. అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్‌బీఎఫ్) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓసియన్ గ్రూప్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్‌హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్‌శర్మ, బ్లాక్‌స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్‌వీ టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఎం రేవంత్ వారికి వివరించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతో.. రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు అధికారులతో కూడిన ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం చేపట్టిన మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం రాత్రి ఈ బృందం స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు బయలుదేరింది. దావోస్ వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ప్రపంచ ఆర్థిక ఫోరం’ వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఆ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.
సింగపూర్ నుంచి రూ.3950 కోట్ల పెట్టుబడులు..
సింగపూర్ నుంచి తెలంగాణకు దాదాపు రూ.3,950 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ మేరకు పెట్టుబడులు సాధించింది. పెట్టుబడులు, ఒప్పందాలతోపాటు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో స్కిల్స్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరిణామం. కాగా, హైదరాబాద్‌లో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
Updated Date - Jan 20 , 2025 | 04:21 AM