Sangareddy: రాతి గుండె తల్లి
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:14 AM
అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయినవారు నిద్రపోయినట్లుగా ప్రాణాలొదలడం.. పక్కనే నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన ఘటన గుర్తుందా? వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్తవైపే చూపాయి.
అమీన్‌పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టింది కన్నతల్లే
చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం
భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
పిల్లలను అడ్డుతొలగించుకుంటేనే పెళ్లి అని ప్రియుడి షరతు
ముక్కు, నోరు అదిమి ముగ్గురు పిల్లల్ని హత్యచేసిన రజిత
ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ అరెస్టు.. రిమాండ్
సంగారెడ్డి క్రైం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయినవారు నిద్రపోయినట్లుగా ప్రాణాలొదలడం.. పక్కనే నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన ఘటన గుర్తుందా? వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్తవైపే చూపాయి. భార్య ప్రవర్తనను అనుమానించే ఆ భర్త తరచూ ఆమెతో గొడవపడటం. ఆ వేధింపులను తాళలేక ఒకానొక దశలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం.. మళ్లీ గొడవపడితే పిల్లలను చంపేసి తాను చస్తాననే షరతుతో తిరిగి కట్టుకున్నవాడి చెంతకు రావడంతో భర్త తీరు కారణంగానే పిల్లలతో కలిసి విషాహారం తిని ఆత్మహత్యాయత్నం చేసిందా? లేదంటే ఆ భర్తే.. పిల్లలను, భార్యను వదిలించుకునేందుకు ఘోరానికి ఒడిగట్టి ఉంటాడా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా దిగ్ర్భాంతికరమైన వాస్తవం విచారణలో వెలుగుచూసింది! ఆ భార్యే ఘోరానికి ఒడిగట్టింది. పేగు తెంచుకొని పుట్టారన్న మమకారాన్ని మరిచిపోయి.. ప్రియుడి మోజులో కళ్లు మూసుకుపోయి.. అతడితో తన పెళ్లికి బిడ్డలే అడ్డుగా ఉన్నారని వారిని నిర్దాక్షిణ్యంగా చంపుకొంది ఆ తల్లేనని పోలీసులు తేల్చారు.
కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన అవురిచింతల చెన్నయ్య (50) మొదటి భార్య చనిపోయింది. కొన్నాళ్లకు తనకన్నా వయసులో 20 ఏళ్ల చిన్నదైన రజిత (30) అలియాస్ లావణ్యను చెన్నయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు సాయికృష్ణ(12), మధుప్రియ(10) గౌతమ్(8) పిల్లలు. అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఈ కుటుంబం ఉంటోంది. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. రజిత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న చెన్నయ్య తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అతడి వేదింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి భర్త చెంతకు వచ్చింది. గత నెల 27వ తేదీ రాత్రి 8 గంటలకు పిల్లలతో కలిసి చెన్నయ్య, రజిత భోజనం చేశారు. రజిత, పిల్లలు పెరుగన్నం తినగా చెన్నయ్య పప్పన్నం తిని విధులకు వెళ్లిపోయి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికొచ్చాడు. తెల్లవారుజామున మూడు గంటలకు రజిత తనకు కడుపునొప్పి అంటూ బిగ్గరగా రోదించడంతో స్థానికుల సాయంతో భర్త చెన్నయ్య ఆమెను ఆస్పత్రికి తరలించాడు. తర్వాతే ముగ్గురు పిల్లలు మృతిచెందినట్లుగా గుర్తించారు.
చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం
రజితకు పదో తరగతి చదివే రోజుల్లో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్లకు చెందిన నూరు శివకుమార్ (30) క్లాస్‌మేట్! ఆరు నెలల క్రితం పదో తరగతి విద్యార్థులంతా గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే రజిత వెళ్లింది. అక్కడ శివకుమార్‌తో మాట్లాడిన రజిత.. అతడితో చనువు పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త చెన్నయ్యను వదిలేసి వస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా.. కుదరదు అని అతడు చెబితే.. వారిని అడ్డుతొలగించుకొని వస్తానని రజిత అతడికి చెప్పింది. దీనికి అతడు సరేనన్నాడు. ఘటన రోజే శివకు ఫోన్ చేసిన రజిత తాను పిల్లలను చంపబోతున్నట్లు చెప్పింది. ఆ రోజు రాత్రి భర్త, పిల్లలతో కలిసి భోజనం చేశాక చిన్నారులను పడుకోబెట్టింది. భర్త విధులకు వెళ్లిపోయాక నిద్రలో ఉన్న పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్‌ను ఒక్కొక్కరిగా టవల్‌తో ముక్కు, నోరు అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత.. పెరుగన్నం తినడంతోనే ముగ్గురు పిల్లలు మృతి చెందారని నమ్మించేందుకు కడుపునొప్పి నాటకం ఆడి భర్తను, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో నిందితులు రజిత, ఆమె ప్రియుడైన శివను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News
Updated Date - Apr 03 , 2025 | 05:14 AM