నా.. అనుకున్న వారే హంతకులు!
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:22 AM
కూతురు ప్రియుడితో ఫోన్లు మాట్లాడుతుంటే మందలించిన తండ్రిని కొట్టిచంపిన భార్యాబిడ్డలు.. భూమి అమ్మకాన్ని అడ్డుకుంటున్నాడని కన్నతండ్రినే కొట్టి చంపేసిన కొడుకు..
ప్రియుడితో మాట్లాడుతుంటే మందలించాడని
తల్లితో కలిసి తండ్రిని చంపిన కుమార్తెలు
తాడుతో కాళ్లూచేతులు కట్టేసి కొట్టి హత్య
వారికి కూతురి ప్రియుడు, బంధువుల సాయం
భూమి అమ్మనివ్వట్లేదని తండ్రిని చంపిన కొడుకు
భూవివాదంలో అన్నయ్యను చంపిన తమ్ముళ్లు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు
మరిపెడ, కందుకూరు, సీరోలు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కూతురు ప్రియుడితో ఫోన్లు మాట్లాడుతుంటే మందలించిన తండ్రిని కొట్టిచంపిన భార్యాబిడ్డలు.. భూమి అమ్మకాన్ని అడ్డుకుంటున్నాడని కన్నతండ్రినే కొట్టి చంపేసిన కొడుకు.. భూవివాదంలో కత్తులు, కర్రలతో దాడి చేసి అన్నను చంపిన తమ్ముళ్లు..!! కుటుంబం అనే బంధానికి విలువ తగ్గిపోతోందనే మాటకు బలాన్ని ఇచ్చేలా ఉన్న ఈ దారుణ ఘటనలు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం వెలుగు చూశాయి. పోలీసులు, స్థానికుల కథనాల ప్రకారం ఆయా ఘటనల వివరాలిలా ఉన్నాయి.
భార్యాబిడ్డలే ప్రాణం తీశారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎ్‌సఆర్ జెండాల్ తండాకు చెందిన దరావత్ కిషన్(42)కు భార్య జంగ్ని, కుమార్తెలు రమ్య, పల్లవి ఉన్నారు. కిషన్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. డిగ్రీ విద్యార్థిని అయిన కిషన్ చిన్న కుమార్తె పల్లవి.. భూక్య సురేష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. నిత్యం సురే్‌షతో ఫోన్లు మాట్లాడుతుంది. ఈ విషయంలో కిషన్ తన కుమార్తె పల్లవిని మందలించాడు. దీంతో కోపోద్రిక్తులైన భార్య జంగ్ని, కుమార్తెలు రమ్య, పల్లవి, ఆమె ప్రియుడు భూక్య సురేష్, బంధువులు బోడ చందు, బోడ దేవేందర్ కలిసి ఆదివారం రాత్రి కిషన్ కాళ్లూచేతులూ కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా కిషన్ మంగళవారం రాత్రి మరణించాడు.
భూమి అమ్మకానికి అడ్డొస్తున్నాడని..
రంగారెడ్డి జిల్లా పులిమామిడి గ్రామానికి చెందిన పసుపుల జంగయ్య(65), పద్మమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కొడుకు శేఖర్ ఉన్నారు. జంగయ్య.. గ్రామంలో స్లాబ్ వరకు ఇంటి నిర్మాణం చేసి కొడుకు శేఖర్‌కు ఇచ్చి గోడలు నిర్మించుకోవాలని చెప్పాడు. ఇంటి నిర్మాణానికి తన తండ్రి పేరిట ఉన్న 20గుంటల భూమిని అమ్మాలని శేఖర్ అనుకున్నాడు. దీనికి జంగయ్య ఒప్పుకోకపోవడంతో మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి భోజనం అనంతరం జంగయ్య.. నిర్మాణంలో ఉన్న తమ ఇంటి వద్ద నిద్రపోగా, అతని భార్య పద్మమ్మ అదే గ్రామంలో ఉన్న తన రెండో కూతురి ఇంటికి వెళ్లింది. పద్మమ్మ బుధవారం తెల్లవారుజామున తిరిగొచ్చి భర్తను చూసే సరికి తలకు రక్తగాయాలై విగతజీవిగా పడిఉన్నాడు. గ్రామస్తులు శేఖర్‌ను నిలదీయగా.. తండ్రిని తానే చంపానని ఒప్పుకున్నాడు.
అన్నను చంపిన తమ్ముళ్లు
మహబూబాబాద్ జిల్లా సీరోలుకు చెందిన వల్లపు లింగయ్య మొదటి భార్య మాణిక్యమ్మకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కృష్ణ(43) ఉన్నారు. మాణిక్యమ్మ మరణంతో లింగయ్య.. నర్సమ్మను రెండో వివాహం చేసుకోగా కుమారులు నరేష్, మహేష్ ఉన్నారు. లింగయ్య తనకున్న 16 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాలను తలా నాలుగు ఎకరాల చొప్పున ముగ్గురు కొడుకులకి ఇచ్చాడు. మిగిలిన నాలుగు ఎకరాలను తన వద్దే ఉంచుకున్నాడు. ఈ భూముల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే కృష్ణ.. తన వాటా భూమిని కౌలుకు ఇవ్వగా.. నరేష్, మహేష్ కౌలుకు తీసుకున్న వ్యక్తిని బెదిరించడంతో ఆ భూమి బీడుగా మారింది. ఈసారి ఎలాగైనా తన భూమిని కౌలుకి ఇవ్వాలని కృష్ణ హైదరాబాద్ నుంచి తన భూమి వద్దకు రాగా.. నరేష్, మహేష్ తమ భార్యలు, బంధువులతో కలిసి అక్కడికి చేరుకుని ఘర్షణకు దిగారు. కత్తులు, కర్రలతో కృష్ణపై దాడి చేసి అతని ప్రాణం తీసి పరారయ్యారు. అడ్డుకున్న తండ్రి లింగయ్యపై కూడా దాడి చేసి గాయపరిచారు.
Updated Date - Jun 19 , 2025 | 03:22 AM