Rice: సన్నబియ్యం ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో నో స్టాక్
ABN, Publish Date - Jun 12 , 2025 | 08:50 AM
రేషన్ దుకాణాల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 3 నెలల కోటాను ఒకేసారి ఇస్తుండడంతో వారం, పది రోజులుగా రద్దీగా, క్యూ లైన్లతో ఉన్న రేషన్‌షాపులు కొన్నిచోట్ల స్టాక్ లేకపోవడంతో ఖాళీగా ఉండగా, మరికొన్ని చోట్ల డీలర్లు మూసి ఉంచారు.
- చక్కర్లు కొడుతున్న కార్డుదారులు
- సన్నబియ్యం కోసం ఎదురుచూపులు
హైదరాబాద్ సిటీ: రేషన్ దుకాణాల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 3 నెలల కోటాను ఒకేసారి ఇస్తుండడంతో వారం, పది రోజులుగా రద్దీగా, క్యూ లైన్లతో ఉన్న రేషన్‌షాపులు కొన్నిచోట్ల స్టాక్ లేకపోవడంతో ఖాళీగా ఉండగా, మరికొన్ని చోట్ల డీలర్లు మూసి ఉంచారు. హైదరాబాద్ జిల్లాతో పాటు మేడ్చల్, రంగారెడ్డి(Medchal, Ranga Reddy) జిల్లాల పరిధిలో నగర శివారు ప్రాంతాల్లోనూ పలు చోట్ల రేషన్ షాపుల్లో స్టాక్ లేకపోవడంతో మూసి ఉంచారని స్థానికులు వాపోతున్నారు. పోర్టబిలిటీ ఉండడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపులకు వెళ్లినా అక్కడ సైతం స్టాక్ లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. స్టాక్ ఉన్నప్పుడు రద్దీగా ఉందని తిరిగొచ్చి, రెండు రోజుల తర్వాత వెళ్తే స్టాక్ లేదని చెబుతున్నారని వాపోతున్నారు.
సన్న బియ్యానికి పెరిగిన డిమాండ్
ప్రభుత్వం గత ఏప్రిల్ నెల నుంచే సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులందరూ షాపులకు క్యూ కట్టారు. దీనికి తోడు జూన్ నెలలోనే ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తుండడంతో సరుకులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వందల సంఖ్యలో ఉన్న రేషన్ షాపులకు సరిపడా స్టాక్ చేరవేయాలంటే 2-3 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ప్రతి నెలా రేషన్ బియ్యం పంపిణీ 15వ తేదీ వరకు ఉండగా, జూన్ నెలలో మాత్రం 30వ తేదీ వరకు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. గోదాంల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని చేరవేయాలంటే కొంత సమయం పడుతుందని పేర్కొంది. రేషన్ డీలర్లు, ఆయా సర్కిల్ ఏఎస్ఓలు ఇచ్చే సమాచారం మేరకు వెంటనే స్టాక్‌ను పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 12 , 2025 | 08:50 AM