Rice Millers: ‘పౌరసరఫరాల’ రాబడికి గండి!
ABN, Publish Date - Jun 23 , 2025 | 04:22 AM
రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, టెండరు ఏజెన్సీలు... ఏకమై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రాబడికి గండి కొట్టేందుకు యత్నిస్తున్నాయి.
రూ.600 కోట్ల ఎగవేతకు మధ్యవర్తుల కుట్ర. టెండరు ధాన్యం బకాయిల చెల్లింపుల్లో నిర్వాకం
టెండర్లు రద్దు చేయించి.. రూ.2వేలకు బదులు రూ.1,700 చెల్లించే వ్యూహం
టెండరు ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు పెండింగ్
ఏడాదిన్నర నుంచి ప్రభుత్వానికి డబ్బులు కట్టని ఏజెన్సీలు
టెండరు ఏజెన్సీలు, మిల్లర్ల మధ్య ఎడతెగని పంచాయితీ
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, టెండరు ఏజెన్సీలు... ఏకమై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రాబడికి గండి కొట్టేందుకు యత్నిస్తున్నాయి. టెండరు ధాన్యం బకాయిలు రూ.4 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించకపోగా.. అందులోనూ రూ.600 కోట్లు ఎగ్గొంటేందుకు భారీ కుట్రకు తెరలేపాయి. టెండరు ఏజెన్సీలు డబ్బులు చెల్లించకుండా బ్రేక్ వేసిన మధ్యవర్తులు.. పాత టెం డర్లు రద్దు చేయించి, తమ పలుకుబడితో ధాన్యం ధరను క్వింటాల్‌కు రూ.300దాకా తగ్గిస్తామని నమ్మబలుకుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ భవనంలో ఇందుకు సంబంధించిన గూడుపుఠాణీ జరిగినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టి.. ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయి తే ఈవిషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? గ్లోబల్ టెండరు రేటు ప్రకారం క్వింటాల్‌కు రూ.2వేలు వసూలు చేస్తుందా? లాబీయింగ్‌కు తలొగ్గి టెండర్లు రద్దు చేస్తుందా?క్వింటాల్‌కు రూ.1700తోనే సర్దుకుంటుందా?అనేది చర్చనీయాంశంగా మారింది.
2022-23 యాసంగి నాటి ధాన్యం
2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వేలంలో విక్రయించిన విషయం విదితమే. టన్నుకు రూ.20వేల(క్వింటాల్ రూ.2వేల) చొప్పున ఒప్పందం కుదరగా.. మూడు నెలల్లో ధాన్యం ఖాళీ చేసి డబ్బు లు చెల్లించాలన్నది నిబంధన. కానీ, ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇంకా చెల్లింపులు పూర్తి కాలేదు. ఇప్పటికి కేవలం 18 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.3,600 కోట్లను మాత్రమే ఏజెన్సీలు చెల్లించాయి. మరో 20లక్షల టన్నులకు సంబంధించి రూ. 4వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. 5 జిల్లాల పరిధిలోని 81వేల టన్నుల ధాన్యాన్ని తీసుకుని రూ.162 కోట్లు చెల్లించాల్సిన హిందుస్థాన్ ఎంటర్‌ప్రైజెస్ ఏజె న్సీ.. ఇప్పటిదాకా ఒక్క ధాన్యం గింజనూ లోడ్ చేయలేదు. కేంద్రీయ భండార్ 54ు, మంచుకొండ ఆగ్రోటెక్ 68ు, నాఫెడ్ 42ు మాత్రమే పురోగతి సాధించాయి. సగటున 47ు టార్గెట్ పూర్తయింది. ఇంకా 53 శాతం పెండింగ్ ఉంది.
రూ. 414 కోట్ల అక్రమ వసూళ్లు
నిబంధనల ప్రకారం కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీలు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు క్వింటాల్‌కు రూ. 2వేల చొప్పున సొమ్ము చెల్లించి, రిలీవ్ ఆర్డర్(ఆర్వో) తీసుకొని ధాన్యం తీసుకెళ్లాలి. కానీ, ఆ ప్రక్రి య జరగడం లేదు. క్వింటాల్‌కు రూ.2,230 చొప్పున రైస్‌మిల్లర్లు డబ్బు చెల్లిస్తే తాము రూ.230 మినహాయించుకొని, రూ.2వేల చొప్పున పౌర సరఫరాల సంస్థకు చెల్లిస్తామని ఏజెన్సీలు మెలిక పెట్టాయి. అయితే, దీనికి రైస్ మిల్లర్లు అంగీకరించలేదు. దీంతో రైస్‌మిల్ ఇండస్ట్రీతోపాటు ప్రభుత్వంలో పలుకుబడి గలిగిన మధ్యవర్తులు.. ఇరువర్గాలతో చర్చలు జరిపారు. పౌరసరఫరాలశాఖ అధికారులూ వీరికి తోడవ్వటంతో కొందరు రైస్‌మిల్లర్లపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. నయానో, భయానో ఒత్తిడిచేసి ఇప్పటివరకు 18 లక్షల టన్నుల ధాన్యానికి డ బ్బులు వసూలు చేశారు. క్వింటాల్ రూ.2,230 చొప్పు న రూ.4,014 కోట్లు రైస్‌మిల్లర్ల నుంచి వసూలు కాగా.. ఏజెన్సీలు, మధ్యవర్తులు కలిసి రూ.414కోట్లను మింగేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ధాన్యం సొమ్మును రికవరీ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం.. అక్రమాలపై దృష్టి సారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
మధ్యవర్తుల మాస్టర్ ప్లాన్
ఇంతకాలం రైస్‌మిల్లర్లకు ఫోన్లు చేసి ధాన్యం డబ్బులు కడతారా? లేదా? అని ఏజెన్సీల తరఫున ఒత్తిడి చేసిన మధ్యవర్తులు.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ‘‘టెండర్లు రద్దు చేయిస్తున్నాం. కొద్ది రోజులు ఆగండి. ఎప్పుడు పైసలు కట్టాలో? ఎంత కట్టాలో? మీకు చెప్తాం!’’ అంటూ మిలర్లకు ఫోన్లు చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు, మధ్యవర్తులు, పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉ న్నతాధికారులు మిలాఖత్ అయి.. ఈ కుట్రకు తెరలేపినట్లు తెలిసింది. నిర్ణీత గడువులోగా ప్రభుత్వాని కి సొమ్ము చెల్లించలేదనే కారణంతో తొలుత టెండ ర్లు రద్దు చేయించాలని, ఆ తర్వాత ధాన్యం ధర తగ్గించి మిల్లర్ల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలో వీరు ఉన్నారు. గత టెండరు ధర రూ.2 వేలు కాగా, ఈ సారి మరో రూ.300 తగ్గించి.. రూ. 1,700 చొప్పున వసూలు చేయాలనే చర్చ జరిగినట్లు తెలిసింది. ధర తగ్గించినందుకు రైస్‌మిల్లర్ల నుంచి క్వింటాల్‌కు రూ.50చొప్పున ‘గుడ్ విల్’ వసూలు చేసి, పంచుకోవాలని వ్యూహం రచించినట్లు తెలిసింది. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్ భవనంలో సమావేశమై... అక్కడి నుంచే రైస్‌మిల్లర్లకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్‌కు రైస్‌మిల్లర్లు కూడా అంగీకరించినట్లు తెలిసింది. అయితే, ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2025 | 04:22 AM