సాహిత్య విమర్శకుడు మాదిరాజు కన్నుమూత
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:43 AM
మానవులంతా ఒకటే.. మానవతా రాగం ఒకటే.. ఇది మరిచిన ఉదయం ఒక విషాద కావ్యం.. అంటూ తన కవితా ఖండికల్లో స్వేచ్ఛాగానం చేసిన ఆచార్య మాదిరాజు రంగారావు ఇక లేరు.
ఉస్మానియా, కేయూ తెలుగు ఆచార్యుడిగా సేవలు
వచన కవిత్వాన్ని వ్రతంగా ఆచరించిన ఆధునిక కవి
హైదరాబాద్ సిటీ, హనుమకొండ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): మానవులంతా ఒకటే.. మానవతా రాగం ఒకటే.. ఇది మరిచిన ఉదయం ఒక విషాద కావ్యం.. అంటూ తన కవితా ఖండికల్లో స్వేచ్ఛాగానం చేసిన ఆచార్య మాదిరాజు రంగారావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మాసబ్‌ట్యాంక్, శాంతినగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా పండితాపురం. నిజాం కాలేజీ, ఉస్మానియా వర్సిటీల్లో ఎమ్‌ఏ సంస్కృతం, తెలుగు అనంతరం పీహెచ్‌డీ పరిశోధన పూర్తిచేసిన రంగారావు యూజీసీ పరిశోధకుడిగానూ కొంతకాలం కొనసాగారు.
తెలుగు మహాభారతం, మహాభాగవతం పరిష్కరణ సమితిలో సభ్యుడిగా ప్రసిద్ధ పండితులు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం సమక్షంలో పనిచేశారు. ఓయూ తెలుగుశాఖలో 1964లో బోధనావృత్తి ప్రారంభించారు. తర్వాత కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, ఫ్యాకల్టీఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా వ్యవహరించారు. వచన కవిత్వాన్ని వ్రతంగా ఆచరించిన ఆయన కవిత్వం, విమర్శ వ్యాసాలు వందకుపైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. 40కి పైగా వచన కవితా సంపుటాలను ప్రచురించారు. పృథ్వీగీతం, మనో భూమికలు, అద్దంలో నీడలు మొదలైన కవితా సంకలనాలను వెలువరించారు. రసధుని సాహితీ పరిషత్ యాభై ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. రంగారావు అంత్యక్రియలు శనివారం సాయం త్రం పంజాగుట్ట శ్మశానవాటికలో పూర్తయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - Jun 22 , 2025 | 04:43 AM