Acharya Lakshminarayana: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కన్నుమూత
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:12 AM
ప్రముఖ సాహిత్య విమర్శకుడు, కవి, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ(78) ఇకలేరు.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సేవలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహిత్య విమర్శకుడు, కవి, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ(78) ఇకలేరు. కొంతకాలంగా కాలిఫోర్నియాలోని కుమారుడు వంశీ దగ్గర ఉంటున్న ఆయన భారత కాలమానం ప్రకారం ఆగస్టు 1, శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. లక్ష్మీనారాయణ స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి మండలంలోని పరికల్లు గ్రామం. అనేక భాషలలో పాండిత్యం కలిగిన ఆయన పలు అనువాదాలు చేశారు. ప్రఖ్యాత కన్నడ రచయిత ఎస్.ఎల్ భైరప్ప రాసిన పర్వ నవలను తెలుగులోకి అనువదించారు. దీనికిగాను 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇందిరాగోస్వామి రచించిన విషాద కామరూప నవలనూ తెలుగు పాఠకులకు అందించిన ఘనత లక్ష్మీనారాయణ సొంతం. విశ్వనాథ సత్యనారాయణ కావ్యానందం రచనను కన్నడలోకి అనువాదం చేశారు. తెలుగు చరిత్ర-కొన్ని కొత్త చూపులు, సాహిత్య పరిశోధనా కళ, తెలుగు సంస్కృతి- శాసనాల, చారిత్రక పరిణామాలు తదితర పరిశోధనాత్మక రచనలు పుస్తకాలుగా వెలువడ్డాయి. లక్ష్మీనారాయణ అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహిస్తున్నట్లు కుమారుడు వంశీ తెలిపారు.
Updated Date - Aug 02 , 2025 | 05:12 AM