RRR Railway Line Telangana: ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రైలుపై భేటీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:16 AM
రీజినల్ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది..
రీజినల్ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గం.. నిర్మాణానికి సర్వే చేయాలన్న కేంద్రం
రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారుల కీలక సమావేశం
రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక సర్వే
ఆగస్టు మొదటి వారానికల్లా సమగ్ర సర్వే
ఆ తర్వాత ముఖ్యమంత్రికి నివేదిక
ఆర్‌ఆర్‌ఆర్ కోసం 100 మీటర్ల సేకరించే భూమికి అదనంగా 20-25 మీటర్ల సేకరణ!
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే విషయాన్ని రైల్వే అధికారులకు తెలిపింది. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రైలు!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ సోమవారమే వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయం గురించి రైల్వే అధికారులు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. సచివాలయంలో వెంటనే ఈ అంశంపై రైల్వే శాఖ ముఖ్య అధికారులు, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో పాటు రెండు శాఖలకు సంబంధించిన కన్సల్టెన్సీల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా 3-4 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని ప్రతిపాదించిన రైలు మార్గాన్ని.. రోడ్డు పక్కనే నిర్మించాలంటూ కేంద్రం నిర్ణయించడంపై చర్చ జరిపారు. ప్రస్తుతం రింగు రైలు మార్గానికి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) పూర్తయింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు పక్కనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు, ప్రతికూల పరిస్థితులపై లోతుగా చర్చించారు. ఇప్పటికే రింగు రోడ్డు ఉత్తరభాగం కోసం భూ సేకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. దాంతో రైలు మార్గం నిర్మాణానికి ఎంత భూమి అవసరమవుతుంది? ఇంకా అదనంగా ఎంత సేకరించాలి? అనేదానిపై చర్చించారు. రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి వంకలు, మలుపులు, ఎత్తు, పల్లాలు తదితర అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రైలు మార్గం నిర్మించేందుకు అవసరమైన సర్వేను చేపట్టాలని నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లోనే ప్రాథమిక సర్వేను పూర్తిచేయాలని, ఆ వివరాలతో సమగ్ర సర్వేను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రాథమిక సర్వే వివరాలు వచ్చాక ఒక సమావేశం, సమగ్ర సర్వే వివరాలు వచ్చిన తర్వాత రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారుల స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఎంకు సమగ్ర నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్కనే హైస్పీడ్ రైలు మార్గం నిర్మించే అంశంపైనా అధికారులు చర్చించినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో తెలిపింది.
మరో 20-25 మీటర్ల మేర భూమి సేకరణ..
రీజినల్ రింగు రోడ్డుకు పక్కనే రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలంటే అదనంగా మరికొంత భూమి అవసరమవుతోందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతానికి ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం కోసం (ప్రస్తుతం 6 లేన్లు, భవిష్యత్‌లో 8 లేన్లు) ఉత్తరభాగంలో 100 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేపట్టారు. దాదాపు ఇది పూర్తికావొచ్చింది. తాజాగా రోడ్డుతో పాటే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో మరికొంత భూమి కావాలి. ఇందుకోసం అదనంగా మరో 20-25 మీటర్ల వెడల్పున భూమిని సేకరించాలని మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. రైలు మార్గం ఏర్పాటుకు సుమారు 40-45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలని రైల్వే అధికారులు అంటున్నారు. దాంతో అదనంగా 20-25 మీటర్లు సేకరించి, ఇంకా కావాల్సి ఉంటే భవిష్యత్‌లో రోడ్డు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఉండేలా భూమిలో కొంత భాగాన్ని వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ అంశాన్ని తేల్చేందుకే ప్రాథమిక సర్వేను చేపట్టనున్నారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో రైలు మార్గం నిర్మాణానికి ఉన్న అవకాశాలపై తొలుత సర్వే చేయనున్నారు. తర్వాత దక్షిణభాగం వైపు నిర్వహించనున్నారు. కాగా, రైలు మార్గం నిర్మాణానికి అవసరమైన భూమి విషయంలో ఉత్తరభాగంలోనే ఇబ్బందిగా ఉంటుందని.. దక్షిణభాగంలో రోడ్డు, రైలు మార్గాలకు కలిపే భూమిని సేకరించే అవకాశం ఉందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. మరోవైపు ప్రస్తుతం ప్రతిపాదించిన రీజినల్ రింగు రైలు.. ఆర్‌ఆర్‌ఆర్‌కు 3-4 కి.మీ దూరంలోనే ఉందని చెబుతున్నప్పటికీ ఎఫ్‌ఎల్‌ఎస్ వివరాల ప్రకారం ఒక్కోచోట 11-14 కిలోమీటర్ల మేర దూరం ఉండడం గమనార్హం. అలా కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రైలు మార్గంతోపాటు అవసరమైన చోట స్టేషన్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
‘ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్’లో భాగంగానే..
రోడ్డు, రైలు మార్గాలు పక్కపక్కనే ఉంటే.. ప్రజల ప్రయాణాలకు సౌకర్యంగా ఉండడంతో పాటు రవాణా ఆధారిత వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అదే విధంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానం ‘ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్’లో రోడ్డు, రైలు మార్గాలను నిర్మించాలని.. ప్రస్తుతం ఎక్కడైనా రోడ్డు, రైలు మార్గాల మధ్య దూరం ఉంటే వాటి అనుసంధానతను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రీజినల్ రింగు రైలును ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే నిర్మించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం మెట్రో రైలు, బస్సులతో పాటు స్థానిక ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉంటుందని, ట్రాఫిక్‌ను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పక్కపక్కనే రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాలు జరిగితే దేశంలో ఇదే మొదటిది అవుతుందని కూడా అధికార వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 06:16 AM