Ponguleti: నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్
ABN, Publish Date - Jun 16 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుందన్నారు.
వచ్చే క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై స్పష్టత
వారం రోజుల్లో రైతుభరోసా, సన్నాలకు బోనస్
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన
దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం
7,578 సదస్సుల్లో 4.61లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలోని 5 నక్షా గ్రామాల్లో సర్వే: పొంగులేటి
హైదరాబాద్/కూసుమంచి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, తర్వాత పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. గడువు సమీపిస్తున్నందున ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో పాలేరుకు చెందిన ముఖ్య నాయకులతో పొంగులేటి సమావేశం నిర్వహించారు. మరో వారంలో రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్ ను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదేనని, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 561 మండలాల్లో 7,578గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, వీటిలో 4.61లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సర్వే రికార్డులు లేని ఐదు నక్షా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ సర్వే శరవేగంగా జరుగుతోందన్నారు.
నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధుల జమ, రైతు నేస్తం కార్యక్రమం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందంటూ పలువురు మంత్రులు పరోక్ష సంకేతాలిస్తున్న నేపథ్యంలో వాటి నిర్వహణపై కూడా చర్చించనున్నారని సమాచారం. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, యూనిట్ల మంజూరు విషయాలపై కూడా మాట్లాడే అవకాశమున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారని తెలిసింది.
Updated Date - Jun 16 , 2025 | 04:12 AM