Phone Tapping: 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్!
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:52 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ 2023లో ఎన్నికల ముందే కాదని.. 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లోనూ జరిగిందని అధికారులు గుర్తించారు.
రివ్యూ కమిటీకి వివరాలివ్వకుండా కుట్ర
అవసరమైన కొన్ని నంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు, ఇతర నంబర్లతో ఫైల్!
కొన్ని నంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ
కమిటీ చైర్మన్, సభ్యుల వాంగ్మూలాలతో వెలుగులోకి వివరాలు
కామారెడ్డిలో బీఆర్‌ఎస్ వార్‌రూమ్.. అక్కడ్నుంచే ట్యాపింగ్?
నేడు మళ్లీ సిట్ ఎదుటకు ఎంపీ ఈటల
హైదరాబాద్/కామారెడ్డి/రాయపర్తి/తాండూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ 2023లో ఎన్నికల ముందే కాదని.. 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లోనూ జరిగిందని అధికారులు గుర్తించారు. మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, సంఘ విద్రోహుల పేరు చెప్పి.. ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులతో పాటు వ్యాపారులు, కొందరు అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. సిట్ దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న క్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, మునుగోడు ఉప ఎన్నిక, 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు ఇచ్చిన నంబర్లను అప్పటి రివ్యూ కమిటీ పరిశీలించి, కేంద్ర టెలికం శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్లు తేలింది. అయితే ఇక్కడే కుట్రపూరితంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీకి పూర్తి వివరాలు ఇవ్వకుండా అవసరమైన అతి కొద్ది నంబర్లతోపాటు టార్గెట్ చేసిన వారి నంబర్లతో ఫైల్ పంపించి, అనుమతులు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎప్పటికప్పుడు టార్గెట్ చేసిన వారి ఫోన్ నంబర్లతో ఫైల్ సిద్ధం చేసి పంపి, రివ్యూ కమిటీ డీవోటీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది.
రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్న అప్పటి సీఎస్ శాంతికుమారి, సభ్యులుగా ఉన్న జీఏడీ పొలిటికల్ కార్యదర్శి రఘునందన్‌రావు, అప్పటి హోం శాఖ కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌కుమార్‌ల వాంగ్మూలం సేకరించిన సమయంలో సిట్ ఈ విషయం గుర్తించినట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి తిరిగి వచ్చిన తర్వాత అవసరమైతే మరోసారి వివరాలు సేకరించి, పూర్తిస్థాయిలో వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ఎస్‌ఐబీ నుంచి ట్యాపింగ్ జాబితా రావడంతో నమ్మకంతో రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించకుండానే కేంద్ర టెలికం శాఖకు ఫైల్ పంపినట్లు తేలింది. అప్పటికీ కొన్ని అనుమానాస్పద నంబర్లకు అనుమతులు ఇవ్వకుండా కమిటీ తిరస్కరించినట్లు విచారణలో గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు 5 సార్లు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు రివ్యూ కమిటీ అనుమతి, ఆమోదంతోనే ట్యాపింగ్‌లు చేసినట్లు వెల్లడించారు. అసలు విషయాలను అధికారులకు నివేదించకుండా, కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు అంచనాకు వచ్చారు. ఇక కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కొందరు సాక్షులు సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. అధికారులు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల మంగళవారం విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షుల వాంగ్మూలం, రివ్యూ కమిటీ సమాధానాలు, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ప్రభాకర్‌రావును మరోసారి విచారించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది.
విచారణకు హాజరైన కాంగ్రెస్ నేతలు..
వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. జంగా రాఘవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో సుధీర్‌రెడ్డి ఆయన అనుచరుడిగా పనిచేశారు. అనంతరం వారి మధ్య విభేదాలు రావడంతో సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2024లో తిరిగి కాంగ్రె్‌సలోకి వచ్చారు. కాగా, సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎర్రబెల్లి తన ఫోన్‌ను ట్యాప్ చేశాడని చెప్పడంతో విచారించిన అధికారులు నిజమేనని తేల్చారని చెప్పారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు కూడా ట్యాపింగ్ బాధితులుగా ఉన్నారు. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ దేవరాజుగౌడ్‌కు ఇప్పటికే పిలుపు రాగా.. సోమవారం మరికొందరు నేతలకు సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వాలంటూ పోలీసులు ఫోన్లు చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు కాం గ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ బృందం నిర్ధారించింది. గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయగా.. చంద్రశేఖర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలంటూ చంద్రశేఖర్‌రెడ్డిని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరగా.. తాను బుధవారం వచ్చి వాంగ్మూలం ఇస్తానని తెలిపారు. ట్యాపింగ్ కేసులో ఉపాధ్యాయ సంఘం నేత, తాండూరు మండల ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మహిపాల్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.
కామారెడ్డిలో బీఆర్‌ఎస్ వార్‌రూమ్?
గత ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలో దిగారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేటీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ బరిలో దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రత్యేక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కామారెడ్డిలోని విద్యానగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ వార్‌రూమ్ ద్వారానే కాంగ్రెస్ ముఖ్యనేతల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు ప్రచారం సాగుతోంది.
సినిమా వాళ్ల ఫోన్లూ ట్యాప్..
సినీ రంగానికి చెందిన వారి ఫోన్లనూ ప్రభాకర్‌రావు బృందం ట్యాప్ చేసినట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను సిట్ అధికారులు విచారించారు. అనేక అంశాలపై ప్రశ్నలు అడిగి, ఆయన వాంగ్మూలం సేకరించారు. శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో ఆరు నెలల పాటు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని భరత్ భూషణ్ చెప్పినట్లు తెలిసింది. సినీ పరిశ్రమకు చెందిన మరికొందరి నుంచి కూడా వాంగ్మూలాలు సేకరించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 06:59 AM