Nizamabad Palm Oil Industry: నిజామాబాద్‌లో పామాయిల్ పరిశ్రమ!
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:07 AM
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు...
బోధన్ ప్రాంతంలో ఏర్పాటుకు సీఎం సుముఖత
చెరుకు పంటకుప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు.. రాష్ట్రంలో మరో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో ఈ పరిశ్రమల నిర్మాణాలు పురోగతిలో ఉండగా.. కొత్త ఫ్యాక్టరీని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు! చెరుకు సాగుకు చిరునామాగా ఉండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మెదక్ జిల్లా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్రణాళికలు రచించింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్ మండలాల మధ్య ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీన్ని తొలుత నిర్మల్ జిల్లాలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు రాగా, అక్కడ ఉద్యానశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ అక్కడ ఫ్యాక్టరీ మనుగడ సాధించటం కష్టమని తేలడంతో వెనక్కితగ్గారు. బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని.. నెలాఖరులో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించ బోయే బహిరంగసభలో ఆయన దీనిపై ఒక ప్రకటన చేయనున్నారని సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తుండగా.. ఏడాదిలోగా ఆ విస్తీర్ణాన్ని 15 వేల ఎకరాలకు పెంచాలని రాష్ట్ర ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
31 జిల్లాల్లో..
రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహాయించి 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈమేరకు 14 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఆయా కంపెనీలకు ఏరియాలను కూడా పంచింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆగస్టు 15 నాటికి ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ప్రకటించారు.
చెరుకు, వరికి ప్రత్యామ్నాయంగా..
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. ఏడాదికి కోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగవుతోంది. వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో... 5 ఎకరాల ఆయిల్ పామ్ తోటకు నీరు అందివ్వొచ్చు. ఈక్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు చెరుకు సాగు ఎక్కువగా ఉండేది. ఒక్క బోధన్ చక్కెర కర్మాగారం పరిధిలోనే 13,500 ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. ఇప్పుడది గణనీయంగా తగ్గి, రైతులంతా వరి వైపు మళ్లారు. వారిని ఇప్పుడు ఆయిల్ పామ్ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చెరుకు కంటే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఆయిల్ పామ్ సాగుచేయొచ్చని రైతులకు అవగాహన కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 06:07 AM