Finance Fraud: అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేసి
ABN, Publish Date - Apr 22 , 2025 | 04:41 AM
ఒక సంస్థ 2,500 మంది నుంచి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 14 మందిపై కేసు నమోదైంది, ఐదు మంది అరెస్టు కాగా, పరారీలో ఉన్న వారంతా ప్రజా వ్యక్తులతో కలసి తిరుగుతున్నారని పోలీసులు పేర్కొన్నారు
ఓం సాయి శ్రీరాం ఫైనాన్స్ సంస్థ ఘరానా మోసం
2,500 మందికి 200 కోట్లకుపైగా టోపీ
నిందితులు బయట తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు
సీఎం న్యాయం చేయాలి: బాధితులు
పంజాగుట్ట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము.. పాలమూరు ప్రాజెక్టులో భూములు మునిగిపోతే ఇచ్చిన పరిహారం.. ఏదీ వదల్లేదు.. అధిక వడ్డీ వస్తుందని ఆశపెట్టారు.. డబ్బులు డిపాజిట్ చేయించుకుని నిలువునా ముంచారు. రాజకీయ నాయకులతో కలిసి దర్జాగా తిరుగుతున్నారు. పోలీసులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి..’’ అని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎల్లమ్మ, దస్తగిరి, నాగమ్మ, వెంకటయ్య, భాగ్యమ్మ, పర్వతాలు తదితరులు మాట్లాడారు. ఇట్యాల సాయిబాబు, అతడి సోదరులు ఇట్యాల ధనుంజయ, బాలేశ్వర్, మరికొందరు కలిసి నాగర్‌కర్నూల్‌లో ఓం సాయి శ్రీరాం ఫైనాన్స్ సంస్థను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆ సంస్థ 2,500 మంది నుంచి రూ.200 కోట్లకుపైగా వసూలు చేసి మోసానికి పాల్పడిందని ఆరోపించారు. దీనిపై పోలీసులు 14 మందిపై కేసుపెట్టి ఐదుగురినే అరెస్టు చేశారని.. నాగం కరుణాకర్‌రెడ్డి, నాగం బుచ్చిరెడ్డి, జానకిరామ్‌రెడ్డి, సాయిబాబు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు చూపారని తెలిపారు. నిజానికి వారంతా బహిరంగంగా ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో ఇప్పటికే 105 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు ప్రజాసంఘాల నేతలు విమలక్క, పాశం యాదగిరి సంఘీభావం తెలిపారు.
Updated Date - Apr 22 , 2025 | 04:41 AM